ఏపీలో టీడీపీ నేతలు చేస్తున్న ఆరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి నోరు అదుపులో పెట్టుకోవాలని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున సూచించారు. విజయవాడలో వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను విమర్శించే అర్హత ఆయనకు లేదన్నారు. సినిమా హాల్లో టిక్కెట్లు అమ్ముకున్న సత్యనారాయణమూర్తికి వైసీపీ నాయకులపై అవాకులు, చవాకులు పేలే అర్హత లేదని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే సత్యనారాయణ అరాచకాలపై బహిరంగ చర్చకు తమ పార్టీ మండల అధ్యక్షుడు వస్తాడని, ఆయన స్థాయికి మండలాధ్యక్షుడు చాలని ఎద్దేవా చేశారు. సత్యనారాయణ, ఆయన కుమారుడే జెర్రిపోతులపాలెం ఘటనలో అసలు సూత్రధారులని ఆరోపించారు. నోరు ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జెర్రిపోతులపాలెం ఘటనపై సత్యనారాయణ, ఆయన కుమారుడిపై ప్రైవేటు కేసు పెడతామన్నారు. ఈ అంశాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు.