సీనీ నటుడు ,సూపర్‌స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై నెలకొన్న ఉత్కంఠకు ఇవాళ తెరపడింది. పొలిటికల్ ఎంట్రీపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన ప్రకటన చేశారు.గత కొంత కలం నుండి తన అభిమానులతో వరుస భేటీలు జరుపుతూ రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఇవాళ ప్రకటిస్తానన్న విషయం తెలిసిందే.
తన ఇంటి నుంచి అభిమానులతో భేటీఅయ్యే ప్రదేశం శ్రీ రాఘవేంద్ర కల్యాణ మండపానికి బయల్దేరేటప్పుడు సైతం మీడియా ఆయనను పలకరించినా స్పందించలేదు. సభా స్థలికి చేరుకున్న అనంతరం అభిమానులతో భేటీ సందర్భంగా రజనీకాంత్ రాజకీయ ప్రకటన చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వస్తున్నట్లు స్పష్టంచేశారు. త్వరలోనే కొత్త పార్టీ స్థాపించనున్నట్లు వెల్లడించారు. దేశంలో రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయన్నారు. రాజకీయ మార్పు కోసం సమయం ఆసన్నమైందని తెలిపారు.
పదవి, డబ్బు కోసం రాజకీయాల్లోకి రావట్లేదని చెప్పారు. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తానన్నారు. తమిళ ప్రజల మద్దతు ఉంటే నిజాయితీతో కూడిన రాజకీయాలు సాధ్యమనన్నారు. ప్రజల ఆదరణ, దేవుని కటాక్షం తనకున్నాయని నమ్ముతున్నట్లు చెప్పారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లోపే కొత్త పార్టీ స్థాపించనున్నట్లు తెలిపారు. 234 అసెంబ్లీ స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు.