రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ నాలుగో దశకు నీటిపారుదల శాఖ భారీ ఎత్తున సమాయత్తం అవుతోంది. ఈ దశ కింద 5073 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా ఎంచుకున్న అధికారులు ఆ మేరకు యుద్ధప్రాతిపదికన ప్రతిపాదనల రూపకల్పన, ప్రభుత్వానికి సమర్పించే ప్రక్రియలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కూడా వేగంగా పాలనా అనుమతులను కల్పిస్తున్నది. శనివారం ఒక్కరోజే ఏకంగా రూ.223.32 కోట్ల విలువైన చెరువుల పునరుద్ధరణ పనులకు పాలనాపరమైన అనుమతులిస్తూ జీవోలు జారీకావడం విశేషం.
మిషన్ కాకతీయ నాలుగో దశ పనులను జనవరి మొదటి వారంలోనే ప్రారంభించాలని ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు స్పష్టంచేశారు. ఈ దశ కింద ఒకవైపు కొత్త చెరువుల నిర్మాణంతోపాటు పాత చెరువుల పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే కొత్త చెరువులకు సంబంధించి నీటిపారుదల శాఖ 52 ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపగా.. అందులో పాత ఆదిలాబాద్ జిల్లా పరిధిలో 28 కొత్త చెరువుల నిర్మాణానికి చేపట్టాల్సిన భూసేకరణకు రూ.94.60 కోట్ల నిధులను కూడా మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మెదక్ జిల్లా పరిధిలోనూ మరో ఎనిమిది కొత్త చెరువుల నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణకు రూ.13 కోట్లను కూడా విడుదల చేసింది. మరోవైపు నాలుగో దశ కింద 5073 చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా ఎంచుకుంటే ఈ నెల 20వ తేదీన నాటికే 6061 చెరువుల ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఆ తేదీ నాటికి నీటిపారుదల శాఖ అందులో 4567 చెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నెల 20 నాటికి ప్రభుత్వం రూ.184.65 కోట్ల విలువైన 330 చెరువుల పునరుద్ధరణ పనులకు పాలనా ఆమోదం తెలిపింది. ఆ తర్వాత పలు చెరువుల పనులకు ఉత్తర్వులు జారీచేసింది.
శనివారం ఒక్కరోజే ఏకంగా 968 చెరువుల పునరుద్ధరణకు సంబంధించి రూ.223.32 కోట్ల విలువైన పనులకు ప్రభుత్వం పాలనా అనుమతులు ఇవ్వడం విశేషం. రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, సంగారెడ్డి, కొత్తగూడెం, మెదక్, సూర్యాపేట, కామారెడ్డి, వికారాబాద్, కుమ్రంభీం, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మంచిర్యాల, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల పరిధిలో ఈ చెరువులు ఉన్నాయి. ఈ అన్ని చెరువుల పునరుద్ధరణతో సుమారు 49,067.61 ఎకరాలకు ప్రయోజనం కలుగనుంది. దీనితోపాటు నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను రూ.14.01 కోట్లతో చేపట్టేందుకు కూడా ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.