భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ను ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎటువంటి చార్జీలు లేకుండా ఉచితంగా వ్యవసాయానికి 24 గంటలపాటు విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ తనపేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకోనున్నది. తెలంగాణ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరబోతున్నది.
ఈ క్రమంలో రైతాంగానికి నిరంతరం ఉచితంగా విద్యుత్ సరఫరాను నూతన సంవత్సర కానుకగా తెలంగాణ సర్కారు అమలు చేస్తున్నది. 2018 జనవరి 1వ ( ఆదివారం అర్ధరాత్రి 12.01 గంటల నుంచి ) తేదీలోకి అడుగుపెట్టిన మొదటి నిమిషం నుంచి నిరంతర విద్యుత్ సరఫరా ప్రారంభమవుతుంది. కొత్త సంవత్సరం పూట రైతుల జీవితాల్లో ఆనందాల వెలుగులు విరజిమ్మాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం సాకారమవుతుంది.
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాకు ఎలాంటి అవాంతరాలు రాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ముందుగానే అన్ని రకాల ప్రయోగాలు నిర్వహించి, లోపాలను సరిదిద్దుకొని, రాష్ట్ర విద్యుత్ సంస్థలు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేశాయి.ఈ నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు 24 గంటల విద్యుత్‌ను ఉచితంగా అందించేందుకు వీలుగా ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం సమీక్షిస్తున్నారు.