టీడీపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి సుజనా చౌదరికి పార్లమెంటు సాక్షిగా అనూహ్యమైన షాక్ తగిలింది. అందులోనూ సాక్షాత్తు లోక్ సభ స్పీకర్ ద్వారా కావడం గమనార్హం. పార్లమెంటు సంప్రదాయాల ప్రకారం టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ప్రసంగిస్తుంటే..దానికి అడ్డుపడటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సుజనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే… ప్రత్యేక హైకోర్టు అంశంపై బుధవారం టీఆర్‌ఎస్ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తూ లోక్‌సభను అడ్డుకోవడం తో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. గురువారం లోక్‌సభ జీరో అవర్ ప్రారంభం కాగానే టీఆర్‌ఎస్ పక్షనేత ఏపీ జితేందర్‌రెడ్డి.. ప్రత్యేక హైకోర్టు అంశం పై న్యాయశాఖ మంత్రి ప్రకటన చేస్తానని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇలా కీలకమైన హైకోర్టు విభజన అంశంపై టీఆర్‌ఎస్ పక్షనేత ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనాచౌదరి అడ్డుకొనే ప్రయత్నం చేయడంతో స్పీకర్ సుమిత్రామహాజన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. `మీరు కేంద్ర మంత్రి. అది దృష్టిలో పెట్టుకుని వ్యవహరించండి` అని చురకలు అంటించారు. దీంతో అవాక్కయిన సుజనా చౌదరి హైకోర్టుతోపాటు ఇతర విభజన హామీలను ప్రస్తావించారు.
కాగా, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుచేయాలన్న టీఆర్‌ఎస్ ఎంపీల డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తాత్కాలిక భవనాల నిర్మాణం పూర్తికాగానే హైకోర్టును అక్కడకు తరలిస్తామని స్పష్టంచేశారు.