ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరగాల్సిన నేషనల్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా పై కొందరు అవగాహన రాహిత్యం తో మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ స్వంత్రంత్ర సంస్థ అని…సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితుల ఆధారంగా సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ యే సదస్సు నిర్వహణ పై నిర్ణయం తీసుకుంటుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి దీంతో సంబంధం లేదని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి మురళి ఆత్మహత్య తర్వాత నెలకొన్న పరిస్థితులను బట్టి సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు కొంత సమయం కావాలని ఉస్మానియా యూనివర్సిటీ అభ్యర్థించిందని ఎమ్మెల్సీ పల్లా తెలిపారు. కలకత్తాలో సమావేశమైన సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సదస్సును మణిపూర్ లో నిర్వహించాలని నిర్ణయించిందని వెల్లడించారు. కాంగ్రెస్ దాని అనుబంధ సంస్థలే ఓయూలో వాతావరణాన్ని చెడగొట్టాయని తెలిపారు. సైన్స్ కాంగ్రెస్ ను అడ్డుకుంటామని కాంగ్రెస్ విద్యార్ధి నేతలు ప్రకటించారని గుర్తు చేశారు. సమయం దొరికినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నార మండిపడ్డారు.
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదాతో వెయ్యి కోట్ల నష్టం వాటిల్లిందని కొందరు అవగాహన రాహిత్యం తో మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ పల్లా ఎద్దేవా చేశారు. వెయ్యి కోట్ల నష్టం కాదు కదా…వెయ్యి పైసల నష్టం కూడా జరగలేదని ఆయన స్పష్టం చేశారు. సైన్స్ కాంగ్రెస్ వాయిదాతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దిగ జారలేదని తెలిపారు. కొత్త ఆవిష్కరణలు, పేటెంట్ల సాధనలతో యూనివర్సిటీల ప్రతిష్ట పెరుగుతుంది తప్ప సైన్స్ కాంగ్రెస్ లాంటి సదస్సుల నిర్వహణతో పెరగదని ఆయన స్పష్టం చేశారు. సైన్స్ కాంగ్రెస్ వాయిదా వేసేందుకు కాంగ్రెస్ నేతల రెచ్చ గొట్టే వైఖరియే కారణమని అన్నారు. కాంగ్రెస్, దాని విద్యార్థి విభాగం నేతలే సైన్స్ కాంగ్రెస్ వాయిదాకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
యూనివర్సిటీలను కాంగ్రెస్ పార్టీయే తన పాలనలో భ్రష్టు పట్టించిందని ఎమ్మెల్సీ పల్లా మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల పోస్టులను రేట్లు పెట్టి మరీ అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్ నేతలదని విరుచుకుపడ్డారు. కొంత మంది వల్ల ఓయూ వాతావరణం చెడిపోతోందని అన్నారు. జీఈఎస్, ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించామని పేర్కొంటూ ఫిబ్రవరిలో మరో మూడు అంతర్జాతీయ వేడుకలను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నామని ప్రకటించారు. సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు గనుకే దాని పై పట్టుబట్టలేదని ఆయన వెల్లడించారు. ఓయూ విద్యార్థులకు భయపడే సైన్స్ కాంగ్రెస్ పై కేసీఆర్ శ్రద్ధ పెట్ట లేదన్న అవివేకుల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్ఠం చేశారు. ఈ వాయిదా విషయంలో ఓయూ వీసీ తప్పేమి లేదని…ఆయన పై చర్యల ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు.