తెలుగు సినీ పరిశ్రమలో 2017సంవత్సరంలో ఓ విషాదం చోటు చేసుకుంది. వర్థమాన కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. యూసుఫ్‌గూడలోని తన ఫ్లాట్‌లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు . ఆర్థిక ఇబ్బందులు, మానసిక సమస్యలు, వీటికితోడు వైవాహిక జీవితంలో గొడవలు, విజయ్ సాయి ఆత్మహత్యకు కారణమని సన్నిహితులు చెప్పారు. ‘కరెంట్’, ‘అమ్మాయిలు–అబ్బాయిలు’ ఫేమ్ ‘వరప్రసాద్ పొట్టి ప్రసాద్’, ‘ఒకరికి ఒకరు’, ‘బొమ్మరిల్లు’ తదితర సినిమాల్లో విజయ్‌సాయి నటించాడు.
అయితే భార్యాభర్తలు వనిత, విజయ్ మధ్య గత కొంతకాలంగా వివాదాలు ఉన్నాయి. ఈ నెల 9న వనిత.. తన కారును చెప్పకుండా తీసుకెళ్లినట్లు విజయ్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. భార్య వేధింపులకు తోడు గత కొంత కాలం నుంచి సినిమాలు కూడా లేకపోవడంతో విజయ్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తుంది.విజయ్ మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.ఆత్మ హత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోలో విజయ్ మాట్లాడుతూ.. భార్య వనితతో పాటు ముగ్గురిపై ఆరోపణలు చేశారు. ఈ ఉదంతానికి సంబంధించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బెడ్రూంలో ఉరి వేసుకుని..
యూసుఫ్‌గూడలోని శ్రీనివాసం అపార్ట్మెంట్లో తండ్రి సుబ్బారావు, తల్లి వరలక్ష్మమ్మతో కలిసి విజయ్ నివసిస్తున్నారు. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తన బెడ్రూంలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయిన స్థితిలో విజయ్ కనిపించారు. రెండేళ్లుగా విజయ్ ఆయన భార్య వనిత(32) అలియాస్ వరలక్ష్మి అలియాస్ విన్నితో గొడవలు జరుగుతున్నాయి. విడివిడిగా జీవిస్తున్న వీరి విడాకుల కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది. వీరి కుమార్తె కుందన(7) కోర్టు ఆదేశాల మేరకు నిర్ణీత సమయం తండ్రితో ఉంటోంది. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో విజయ్ను కలవడానికి ఆయన స్నేహితుడు సాయి వచ్చారు. ఈ నేపథ్యంలో వరలక్ష్మమ్మ అల్పాహారం సిద్ధం చేస్తుండగా.. స్నానం చేసి వస్తానంటూ విజయ్ బెడ్రూంలోకి వెళ్లాడు. దాదాపు గంట కావస్తున్నా అతడు బయటకు రాకపోవడంతో స్నేహితుడు సాయితో పాటు తల్లి బెడ్రూమ్ వద్దకు వెళ్లి పలుమార్లు విజయ్‌ని పిలిచారు. ఎలాంటి స్పందనా లేకపోవడంతో తలుపులు పగలగొట్టి లోపలకు ప్రవేశించగా.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతున్న స్థితిలో విజయ్ కనిపించారు. వెంటనే కిందకు దింపి చూడగా అప్పటికే విజయ్ మరణించినట్లు గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. విజయ్‌కు ఇటీవల సినిమా అవకాశాలు తగ్గిపోయాయని, ఈ నేపథ్యంలోనే నిరాశకులోనై ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావించారు. అయితే దర్యాప్తులో భాగంగా మృతుడి సెల్‌ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు.. అందులో నాలుగు నిమిషాల నిడివితో ఓ సెల్ఫీ వీడియో ఉన్నట్లు గుర్తించారు. ఆ వీడియోలో విజయ్ ధరించిన వస్త్రాలు, వీడియోలో ఉన్న వాటిని పోల్చిన పోలీసులు.. చనిపోవడానికి కొద్దిసేపటి ముందే దాన్ని చిత్రీకరించినట్లు గుర్తించారు. దీన్ని విశ్లేషణ నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. విజయ్ అమ్మాయిలు అబ్బాయిలు, ఒకరికి ఒకరు, మంగళ, కరెంట్, వరప్రసాద్ పొట్టిప్రసాద్, బొమ్మరిల్లు, నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్, ఇందుమతి, ఏకలవ్యుడు తదితర సినిమాల్లో నటించారు.
ఆ ముగ్గురే కారణమంటూ సెల్ఫీ వీడియో..
తన చావుకు భార్య వనితతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త శశిధర్(నవయుగ సంస్థ), అడ్వొకేట్ శ్రీనివాస్ కారణమని సెల్ఫీ వీడియోలో విజయ్ వెల్లడించారు. వనిత తనకు వాల్‌పోస్టర్ సినిమా షూటింగ్లో పరిచయమైందని, పెళ్ళైన తర్వాతే ఆమె నిజస్వరూపం తెలిసిందని వాపోయాడు. పారిశ్రామికవేత్త సీవీ రావ్ తదితరులు వ్యాపార అవసరాలకు వనితను ఉపయోగించుకున్నారని, వారితో సన్నిహితంగా ఉంటున్న తన భార్య అనైతిక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపించారు. ఆ విషయం తనకు తెలిసినప్పటి నుంచి తమ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని చెప్పారు. చివరకు వనిత తమ కూతురిని కూడా చూడనివ్వడం లేదని అన్నారు. తనకు సంబంధించిన కొన్ని వీడియోలు ఉన్నాయని, అవి బయటపెడుతానని బెదిరించిన అడ్వొకేట్ శ్రీను రూ.3 కోట్లు డిమాండ్ చేసినట్లు వీడియోలో చెప్పారు. వీరంతా తనను తీవ్రస్థాయిలో మానసికంగా హింసించారని వివరించారు. వనితకు గతంలోనే అమ్మిరెడ్డి అనే వ్యక్తితో పెళ్ళైందని, ఆమెతో పాటు ఆమె తల్లి సైతం వ్యభిచారం చేసే వారనే విషయం వారి సొంతూరు వెళ్లినప్పుడు తెలిసిందని వెల్లడించారు. ఇలాంటి వారి వల్ల సమాజం చాలా ఇబ్బంది పడుతుందని, వనిత లాంటి వారిని వదలొద్దని పేర్కొన్నారు. తన తండ్రిని ఉద్దేశించి.. ‘డాడీ.. ఎవ్వరినీ విడిచిపెట్టొద్దు. నిద్ర పట్టడం లేదు.. అందరికీ శిక్ష పడేలా చూడు.. లవ్ యూ డాడీ.. కుందన (తన కుమార్తె) అలాంటి వాతావరణంలో పెరగడం ఇష్టం లేదు.. తీసుకుని రండి డాడీ.. ప్లీజ్ డాడీ..’అంటూ సెల్ఫీ వీడియోలో విజయ్ వేడుకున్నారు. చనిపోవడం కష్టంగా ఉన్నప్పటికీ తప్పట్లేదని, తన కుమార్తెను తల్లి దగ్గర నుంచి తీసుకురావాలని కోరారు.
శనివారమే భార్యపై పోలీసులకు ఫిర్యాదు..
కొన్నాళ్లుగా విడిగా ఉంటున్న భార్య వనితపై విజయ్‌సాయి శనివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ రోజు రాత్రి 9.15 గంటలకు వనిత మరో నలుగురు గూండాలతో కలసి తన ఇంటికి వచ్చి.. తమ వాచ్మెన్ సీహెచ్ భీమన్నను వారు బెదిరించి తన కారు(ఏపీ09సీక్యూ6567)ను ఎత్తుకుపోయినట్లు ఆరోపించారు. తమ విడాకుల కేసు 2015 నుంచి కోర్టు పరిధిలో ఉందని, సదరు కారు తన భార్య పేరు మీదే ఉన్నప్పటికీ తానే ఖరీదు చేశారని వివరించారు. దాని ఫైనాన్స్‌కు సంబంధించిన వాయిదాలు సైతం తానే చెల్లించానని, అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. వనితతో పాటు ఆమె వెంట వచ్చిన నలుగురి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించడంతో పాటు తన వాహనాన్ని తనకు ఇప్పించాలంటూ అభ్యర్థించారు. తన ఆరోపణలకు సా«క్ష్యాధారాలుగా కారుకు సంబంధించిన పత్రాలు, రసీదులతో పాటు తన ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ను అందిస్తున్నట్లు ఆ ఫిర్యాదులో విజయ్ పేర్కొన్నారు.
విజయ్ మృతిపై అనుమానాలు…మలుపులు
విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. సెల్ఫీలో అతడు చేసినవన్నీ నిరాధార ఆరోపణలు. అతడు నన్నెప్పుడూ మంచిగా చూడలేదు. దీనిపై గతంలోనూ కేసులు పెట్టా. అతడికి వేరే యువతితో వివాహేతర సంబంధం ఉంది. దాన్ని నేను స్వయంగా చూశా. దీంతో విడిపోవాలని నిర్ణయించుకుని అప్పటి నుంచి దూరంగా ఉంటున్నా. రెండేళ్ల క్రితం ఆ అమ్మాయిని వివాహం చేసుకుని ఆపై వదిలేశాడు. మా విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. గతంలో పిల్లలు వద్దంటూ నన్ను చిత్రహింసలకు గురి చేశాడు. మూడుసార్లు గర్భస్రావం చేయించాడు. ఏ నాడూ నేను బయటకు వచ్చి చెప్పుకోలేదు. అసలు ఆత్మహత్య చేసుకోవాల్సింది విజయ్ కాదు. గతంలో అతడి వేధింపులు తాళలేని నేనే చేసుకోవాల్సింది. విజయ్ వ్యవహారశైలిని అతడి తల్లిదండ్రులకు చాలాసార్లు చెప్పా. నేనెప్పుడూ అతడిని డబ్బు డిమాండ్ చేయలేదు. శశిధర్‌తో నాకు వివాహేతర సంబంధం ఉందనటం దారుణం. అతనెవరో నాకు తెలియదు. కోర్టు ఆదేశాల మేరకు విజయ్ పాపను తీసుకువెళ్లాడు. తిరిగి తెచ్చుకోవడానికే అతడి ఇంటికి వెళ్లాను. అప్పుడు మా మధ్య ఎలాంటి ఘర్షణా జరగలేదు. ఇప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదు. అతడికి, అతడి తండ్రికి మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయి. విజయ్ మృతిపై నాకూ అనుమానాలున్నాయి. అతడు చనిపోయేటంత పిరికివాడు కాదు. ఆస్తి తగాదాలే విజయ్ మరణానికి కారణమై ఉండొచ్చు. విజయ్ అంటే నాకు ప్రాణం.. అతడిని చంపుకునేంత పిచ్చిదాన్ని కాదు. – మీడియాతో విజయ్ భార్య వనిత
మార్చురీకి వచ్చిన వనిత..
విజయ్‌సాయి మృతదేహాన్ని జూబ్లీహిల్స్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న ఆయన భార్య వనిత తన కుమార్తెతో కలసి విజయ్ భౌతిక కాయాన్ని చూసి తిరిగి వెళ్లారు. అనేకమంది నటీనటులు సైతం ఉస్మానియా మార్చురీకి వచ్చారు. కాగా, విజయ్ మృతదేహానికి మంగళవారం ఉదయం పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించనున్నారు. ఆపై యూసుఫ్‌గూడలోని నివాసానికి తరలిస్తారు. ఆయన అంత్యక్రియలు సిటీలోనే నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా, సెల్ఫీ వీడియో ఆధారంగా వనిత, శశిధర్, అడ్వొకేట్ శ్రీనులపై ఆత్మహత్యకు ప్రేరేపించడం కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సెల్ఫీ వీడియో ఆధారంగా దర్యాప్తు చేయాలి..
చనిపోయిన వ్యక్తిపై ఆరోపణలు సరికాదు. కోర్టు కేసు సందర్భంలో చేయని ఆరోపణలు ఇప్పుడెందుకు చేస్తున్నారు. ఆర్థిక పరంగా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. విజయ్‌కు నటన అంటే ప్రాణం. అందుకే ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చాం. బంగారం, డబ్బు లాంటివి వనిత మా ఇంటి నుంచి మాకు తెలియకుండా తీసుకునేది. రాజీ కోసమంటూ వనిత తరఫు న్యాయవాది తరచు మా ఇంటికి వచ్చేవాడు. కేసు వంకతో డబ్బు డిమాండ్ చేసేవారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్ఫీ వీడియో ఆధారంగా దర్యాప్తు చేయాలి.
మరో మహిళతో చనువుగా ఉన్న ఫొటోలు
విజయ్ సాయి కేసులో మరో సంచలన అంశం బయటకొచ్చింది. ఆయన ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఆయన భార్య వనిత మీడియాకు విడుదల చేశారు. త్వరలోనే కొన్ని వీడియోలు, ఆడియోలతో వచ్చి పోలీసులకు లొంగిపోతానని వెల్లడించారు. విజయ్ నిజ స్వరూపం ఏమిటో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, పోలీసులు తనను క్షమించాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఓ సెల్ఫీ వీడియోను వెల్లడించింది
లొంగిపోయిన వనితారెడ్డి… భార్య
అయితే విజయ్ ఆత్మహత్యకు భార్య వనిత కారణమని విజయ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో ఆమె అప్పటినుంచి పరారీలో ఉంది. ఆమెను పట్టుకునేందుకు పోలీసులు మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. కానీ… వనితారెడ్డి మాత్రం ఇన్నిరోజులు పోలీసులకు దొరకుండా తప్పించుకు తిరిగారు. తాజాగా ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయారు.తన తప్పేంలేదని, విజయ్ ఆత్మహత్యకు తాను కారణం కాదని ఆమె మరోసారి మీడియాకు చెప్పారు. తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విజయ్ తల్లిదండ్రులు తనపైన నేరం మోపేం దుకు చూస్తున్నారని ఆరోపించారు. ఆమె జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లో లొంగిపోవడంతో ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే చాన్స్ ఉందని చెబుతున్నారు.ఈ వార్త కూడ 2017లో ఒక సంఛలనంగా మారింది.