మాస్,క్లాస్, హైటెక్..లోటెక్ అంటూ సెక్షన్ల వారీగా తేడా లేకుండా అన్ని వర్గాల పాపులారిటీని కలిగి ఉన్న మంత్రి మరో వినూత్న ముందడుగుకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇటీవలే మన నగరం పేరుతో టౌన్ హాల్ సమావేశాలు నిర్వహించి హైదరాబాదీలతో సమావేశం అయిన మంత్రి కేటీఆర్..తాజాగా మరో వినూత్న రీతిలో ప్రజలకు చేరువ అయ్యారు. ట్విట్టర్ లైవ్‌లో మంత్రి కేటీఆర్ సంభాషించారు.
#askktr హ్యాష్ ట్యాగుతో ప్రజలు నుండి అభిప్రాయాలు స్వీకరించిన మంత్రి కేటీఆర్ వాటికి విపులంగా, వివరంగా, చమత్కారంగా సందర్భోచితంగా సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం, రాజకీయాలు, మంత్రి వ్యక్తిగత అభిరుచులు, ఇతర అంశాలపైన నెటిజన్లు పలు ప్రశ్నలు సంధించగా…. మంత్రి కేటీఆర్ వాటికి సవివరంగా సమాధానం ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రీకతంగా మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాలు, రంగాలను కలుపుకుంటూ సమ్మిళిత అభివృద్ది దిశగా పోతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రక్షణ భూముల సేకరణ కష్టంగా ఉన్నందున స్కైవేల నిర్మాణం అలస్యం అవుతుందన్నారు. పాతబస్తీకి ఖచ్చింతగా మెట్రోరైలు వస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నగరంలో డీజిల్ బస్సుల వలన కాలుష్యం పెరుగుతుందని, సిఏన్జీ, ఏల్పీజీ బస్సులు వినియోగం గురించి అడిగితే ఎలక్ర్టికల్ వాహానాలే సరైన పరిష్కారం అన్నారు. నగరంలో వైఫై ప్రాజెక్టు 1/3 పూర్తి అయ్యిందని , త్వరలోనే మరిన్ని హట్ స్పాట్లు ఎర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వివరించారు.