ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ వెనకేసుకొని రావడం.. ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కేసులకు సంబంధించి 2జి స్పెక్ట్రమ్ కేసు తీర్పు గురించి తన కాలంలో రాస్తూ జగన్ పై సీబీఐ నమోదు చేసిన కేసులు కేవలం రాజకీయ ప్రేరేపితాలే అంటూ స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి, సోనియా గాంధీకి విధేయత ప్రకటించి ఉంటే జగన్ సీబీఐ కేసుల్లో ఇరుక్కునే వాడు కాదంటూ చెప్పటం గమనార్హం. జగన్ తప్పు చేసాడా లేదా అన్నది కాకుండా కేవలం రాజకీయ కారణాలే కేసు నమోదు కావటానికి కారణాలయ్యాయని తన కాలంలో రాశారు.
దీంతో రాజకీయ మీడియా వర్గాల్లో పెద్ద దుమారమే రేపడమే కాకుండా… ఇక్కడే అందరిలోనూ సందేహాలు కూడా మొదలయ్యాయి. మామూలుగా అయితే, సందర్భం లేకపోయినా జగన్ పై ఏబిఎన్ ఒంటికాలి పై లేస్తూ ఉంటుంది. చంద్రబాబు మీద వ్యతిరేకత తగ్గించేందుకు జగన్ ప్రస్తావన తీసుకురావటాన్ని అందరూ ఎన్నోసార్లు చూసారు. అటువంటిది తన కాలంలో జగన్‌కు కాస్త అనుకూలంగా ఉండేట్లు ప్రస్తావించటంపై చర్చ జరుగుతోంది. వైసీపీ నేతలు చెప్పిన ప్రకారం రాధాకృష్ణ రాతల వెనుక పెద్ద వ్యూహమే దాగుంది. ఇంతకీ అందేమిటంటే, పరువునష్టం కేసులో రాధాకృష్ణ ఇరుక్కున్న విషయం అందరికీ తెలిసిందే.
ఇక ఆమధ్య ప్రధానమంత్రి- జగన్ భేటీపై ఏబిఎన్ లో కథనం వచ్చింది. తనపై ఉన్న కేసులను కొట్టేయించుకునేందుకే జగన్ ప్రధానమంత్రిని కలిసారని అర్దం వచ్చేట్లుగా కథనాలు రాసారు.ఇపుడదే రాధాకృష్ణను కోర్టుకీడ్చింది. జగన్ పై ఏబిఎన్ లో వచ్చిన కథనాల పై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కోర్టులో పరువునష్టం దావా వేసారు. తమ అదినేత జగన్మోహన్ రెడ్డి పరువుకు భంగం కలిగేట్లుగా రాధాకృష్ణ కధనాలు ప్రచురించారంటూ ఆళ్ల వేసిన పిటీషన్ రాధాకృష్ణ మెడకు గట్టిగా చుట్టుకుంది. విచారణకు గైర్హాజరైనందుకు నాంపల్లి కోర్టు రాధాకృష్ణకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు కూడా జారీ చేసింది. వచ్చే వాయిదాకు కోర్టులో రాధాకృష్ణ హాజరుకాక తప్పదు. ఆ కేసులో నుండి బయటపడేందుకు నానా అవస్తలు పడుతున్నారు. అందుకనే సీబీఐ విచారణ తీరుపై కథనం రాస్తూ ప్రజల్లో సానుభూతి వచ్చేట్లు జగన్ ప్రస్తావన తెచ్చి ఉంటారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.