500, 1000 రూపాయల నోట్ల రద్దు అన్నది భారత ప్రభుత్వం అవినీతిపై పోరాడేందుకు, నల్లధనం సమస్యలు తీర్చేందుకు తీసుకున్న నిర్ణయం. 2016 నవంబరు 8 అర్థరాత్రి నుంచి మొదలుకొని అన్ని 500, 1000 రూపాయల నోట్లు చట్టబద్ధమైన మారక విలువను కోల్పోతాయి. 2016 నవంబరు 8న జాతిని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగం ద్వారా దీన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.ఈ ప్రకటనలో మోడీ 500, 1000 రూపాయల బ్యాంకు నోట్లను చెల్లనివిగా ప్రకటించి, కొత్త 500, 2000 రూపాయల నోట్లను చెలామణిలోకి వచ్చినట్టు ప్రకటించారు. ఉగ్రవాదులకు ఆర్థిక వనరుగా మారిన దొంగనోట్ల మాఫియాను, దేశంలోని నల్లధనాన్ని దెబ్బతీసేందుకు ఈ చర్య చేపట్టారు.అయితే మోది ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా విపక్షాలు దేశవ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహించాయి. నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చించిందని…లక్షలాది మంది ప్రజలకు కష్టాలు, నష్టాలు తెచ్చిపెట్టిందంటూ విపక్షాలు ధ్వజమెత్తాయి. మరోవైపు నోట్ల రద్దు సానుకూల ఫలితాలు ఇచ్చిందంటూ బీజేపీ నల్లధనం వ్యతిరేక దినాన్ని పాటించింది.
నోట్లను రద్దు చేసి ఏడాది పూర్తి
మోది సర్కార్ పెద్ద నోట్లను రద్దు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా 6 వామపక్ష పార్టీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఢిల్లీలోని మండీ హౌస్ నుంచి రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వరకు సిపిఎం ఆధ్వర్యంలో వామపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి.
మోదీ నిర్ణయంతో దేశం సర్వనాశనమైందన్న వాపపక్షాలు
పెద్దనోట్ల రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశం సర్వనాశనమైందని వాపపక్షాలు మండిపడ్డాయి. పెద్దనోట్ల రద్దు తర్వాత దేశం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడిందని ఆందోళన వ్యక్తం చేశాయి. లక్షలాది మంది ప్రజలు ఉపాధి కోల్పోయారని, ధరలు పెరిగాయని ఆవేదన వెలిబుచ్చాయి. నోట్లరద్దుతో నల్లధనం తెల్లధనంగా మారిందని వామపక్షాలు ధ్వజమెత్తాయి.
కాంగ్రెస్ నేతృత్వంలోని 18 పార్టీలు దేశవ్యాప్తంగా బ్లాక్ డే
నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని 18 పార్టీలు దేశవ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహించాయి. ఢిల్లీలో యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ కార్యకర్తలు భారీ ప్రదర్శన నిర్వహించారు. నోట్ల రద్దు నిర్ణయం ద్వారా బ్యాంకు క్యూలైన్లలో నిల్చుని వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయరని….భారత ఆర్థిక వ్యవస్థను వీల్‌చైర్‌పైకి తెచ్చారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని మోదీ తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం దేశంలో మహా విషాదాన్ని మిగిల్చిందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కోట్లాది భారతీయులను డిమానిటైజేషన్ నిర్ణయం ఇబ్బందుల్లోకి, బాధల్లోకి నెట్టిందని పేర్కొన్నారు.
నల్లధనంపై ఓ యుద్ధం : నరేంద్రమోది
పెద్దనోట్ల రద్దు నల్లధనంపై చేపట్టిన ఓ యుద్ధమని ప్రధానమంత్రి నరేంద్రమోది అన్నారు. ‘నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా 125కోట్ల మంది భారత ప్రజలు నిర్ణయాత్మక యుద్ధం చేసి.. గెలిచారు. నల్లధనాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన ప్రతి భారతీయుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని ప్రధాని ట్వీట్ చేశారు.
‘నల్లధనం వ్యతిరేక దినం’గా బిజెపి భారీ ర్యాలీ
నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ ‘నల్లధనం వ్యతిరేక దినం’గా బిజెపి ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించింది. మోది ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు వల్ల నల్ల కుబేరులు బెంబేలెత్తిపోతున్నారని, ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని బిజెపి నేతలు వెల్లడించారు. నోట్లరద్దు నిర్ణయంపై ఏడాది పూర్తయినందున అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా దేశవ్యాప్తంగా అనుకూల, వ్యతిరేక ర్యాలీలతో హోరెత్తించాయి.
