ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. మాజీ కేంద్ర మంత్రి, ఏపీకి చెందిన బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన దగ్గుబాటి పురందీశ్వరికి బీజేపీ ప్రమోషన్ ఇవ్వనుంది. త్వరలోనే దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోకి పురందీశ్వరి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభ సీటును కట్టబెట్టనున్నారు.
రాజ్యసభకు ఎన్నికైన మనోహర్ పారికర్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయంతో రక్షణ శాఖ బాధ్యతల నుంచి వైదొలిగారు. గోవా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఖాళీ అయిన సీటును పురందీశ్వరికి ఇవ్వనున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాబోయే ఏప్రిల్ మాసంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఖాళీ అయ్యే ఎనిమిది రాజ్యసభ స్థానాల్లో ఒకటి పురందీశ్వరికి దక్కవచ్చని తెలుస్తోంది.
రాబోయే కొద్దికాలానికి రాజ్యసభ చాన్స్ కోసం పార్టీకి చెందిన ఉత్తరప్రదేశ్ నేతలెవరూ ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే ఏడాది వ్యవధిలోనే పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఉత్తరప్రదేశ్ నుంచి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటు రాష్ట్ర పార్టీ నేతలు ఆసక్తి చూపని నేపథ్యం ఒకవైపు…మరోవైపు పార్టీకి అందిస్తున్న సేవల నేపథ్యంలోఈ అవకాశం ఇవ్వనున్నారు. తద్వారా దగ్గుబాటి పురందీశ్వరికి త్వరలో ప్రమోషన్ దక్కనుందని అంటున్నారు.