కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం జై సింహా. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ వేడుక ఆదివారం విజయవాడలో జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్లో పాల్గొన్న సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ లు ఒకరిపై మరొకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు.
ఆడియో వేదికపై మాట్లాడేందుకు మైక్ అందుకున్న నారా లోకేష్ తన మామపై, సినీ హీరో నందమూరి బాలకృష్ణపై తనదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపించారు. చరిత్ర తరిగరాయాలయ్యా ఒక్క బాలయ్య బాబుతోనే సాధ్యమవుతుందని, బాలకృష్ణ కేవలం సినీ హీరోనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరోనే అన్నారు. తాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి అయినప్పట్నుంచి బాలకృష్ణ హిందూపురం శాసన సభ్యులుగా.. తన నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం ఫోన్ చేస్తుంటారని, నియోజకవర్గ అభివృద్దికి నిధులు మంజూరు చేయండి అంటూ తనను వెంటాడుతుంటారని బాలకృష్ణ గురించి చెప్పారు నారా లోకేష్. అంతేగాక, టీడీపీ ఎమ్మెల్యేలలో అందరికంటే బాగా పనిచేసేది కేవలం ఒక్క బాలకృష్ణేనని ఆడియో వేదికపై వెల్లడించారు నారా లోకేష్.
అయితే, విషయం కాస్తా నెటిజన్ల చెవిన పడటంతో ఆన్లైన్ వేదికగా తమ కామెంట్లకు పనిచెప్పారు.
ఓ పక్క సినీ హీరో, మరో పక్క ఏపీ ముఖ్యమంత్రికి స్వయాన బావమరిది కమ్ వియ్యంకుడు.. ఇంకో పక్క ఐటీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖల మంత్రి లోకష్కే స్వయాన మావ అయిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. అలాంటి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినథ్యం వహిస్తున్న నియోజకవర్గం ఎలా ఉండాలి..? బ్రహ్మాండంగా ఉండాలి కదా..? అని అనుకుంటారు అందరూ. అయితే, దీనికి విరుద్ధంగా హిందూపురం నియోజకవర్గం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుండటం గమనార్హం. దాంతో జనాలు ఇపుడు బాలకృష్ణ మీద మండిపడుతున్నారు. బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఇప్పటి వరకు హిందూపురం వైపు తలెత్తి చూసింది లేదు. చూసినా.. పెద్దగా నియోజకవర్గంలో తిరిగి.. సమస్యలపై ఆరా తీసింది లేదని నెజిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదంతా గమనించిన హిందూపురం నియోజకవర్గ ప్రజలు బాలకృష్ణ వ్యవహారపై మండిపడుతున్నారు. దాంతో నియోజకవర్గంలో తిరగటానికి బాలయ్య భయపడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.