తెలంగాణ సర్కారీ బడుల్లో కొత్త ఉత్సాహం వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు విద్యాశాఖాధికారులు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే విద్యార్థులకు ప్రతి సోమవారం ఒక సబ్జెక్ట్‌ను తీసుకుని వీక్లీ టెస్ట్ లు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ జిల్లాలోని గవర్నమెంట్ స్కూల్స్ లలో 1నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ వీక్లీ టెస్ట్‌ను ప్రామాణికంగా నిర్వహిస్తున్నారు. మొదటి సోమవారం గణితం, రెండో సోమవారం సామాన్యశాస్త్రం, మూడో సోమవా రం ఇంగ్లీష్, నాలుగో సోమవారం తెలుగు నిర్వహిస్తున్నారు. మొత్తం 20 మార్కులకు గాను టెస్ట్ నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తున్నారు. ఈ ఫలితాలను ప్రతి నెల డీఈవోకి అందజేస్తున్నారు. ఈ ఫలితాలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ వారం వారం విద్యార్థుల్లో పురోగతి కనిపించాలని అధికారులను ఆదేశించారు.