కొన్నాళ్ల కిందట టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించి, పార్టీ కండువాను నేలకేసి కొట్టి వెళ్లిన ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తిరిగి టీడీపీలోకే చేరనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కనీసం నెలలు అయినా గడవక ముందే ఈయనకు టీడీపీపై మళ్లీ మమకారం పుట్టిందట. తెలుగుదేశం పార్టీలో తనకు గుర్తింపు దక్కడం లేదని..రాజీనామా చేసి వెళ్లిన ఈయన ఏమనుకున్నాడో ఏమో కానీ మళ్లీ టీడీపీలోకే చేరుతున్నట్టుగా తెలుస్తోంది.
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేశాడు రాంబాబు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ముత్తుముల అశోక్ రెడ్డి చేతిలో ఈయన ఓటమి పాలయ్యాడు. కానీ.. అశోక్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించాడు. అధికార పార్టీలోకి చేరిపోయి.. చంద్రబాబు చేత పచ్చకండువా వేయించుకున్నాడు. అక్కడ నుంచి రాంబాబులో అభద్రతాభావం మొదలైంది. తనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదనే భయం మొదలైంది ఈయనకు. దానికి తోడు చంద్రబాబు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో చేసేది లేక టీడీపీ కండువాను విసిరికొట్టాడు.
అయితే ఈయనకు తెలుగుదేశంలో బంధం తెగిపోలేదు. ఈయన తమ్ముడు టీడీపీలోనే నిలిచాడు. ఆ మధ్య నంద్యాల ఉప ఎన్నిక సందర్భంలో అన్నా రాంబాబు తరఫున డబ్బుల పంపకం బాధ్యతలు తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. పోలింగ్ రోజున జరిగిన అల్లర్లలో కూడా అన్నా రాంబాబు తమ్ముడి పేరు గట్టిగా వినిపించింది. ఇలా తెలుగుదేశంతో ఈయన బంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాంబాబు మళ్లీ టీడీపీలోకి చేరడం పెద్ద విశేషం కాదు.
అయితే.. ఇక్కడ అసలు కథ ఏమిటంటే.. రాంబాబు తలనొప్పి పోయిందని అనుకున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి మళ్లీ టెన్షన్ మొదలవుతోంది. పార్టీలోని పాత వ్యక్తి తిరిగి వచ్చేస్తే తనకు టికెట్ దక్కుతుందో లేదో అనేది అశోక్ రెడ్డి భయం. అశోక్ రెడ్డి ఫిరాయింపుతో ఛీత్కారాలు పొందుతున్నాడు. ఈ మధ్యనే నియోజకవర్గంలో ఇంటింటికీ టీడీపీ అని వెళితే కోడిగుడ్లతో విసిరారు కొంతమంది.
నియోజకవర్గం డెవలప్ మెంట్ కోసం టీడీపీలోకి చేరాను అని చెప్పుకున్నా.. ఆ డెవలప్ మెంట్ దాఖలాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రజా వ్యతిరేకత ఉందని స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ అన్నా రాంబాబు టీడీపీలోకి చేరుతున్నడు కాబట్టి.. టికెట్ విషయంలో అశోక్ రెడ్డి, రాంబాబుల మధ్య పితలాటకం తప్పకపోవచ్చు.