ఏపీలో ఒక్క సంవత్సరం తరువాత ఎన్నికలు రాబోతున్నాయి. అధికార పార్టీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతీరేకత ఉండండతో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది ప్రతిపక్షం పార్టీ అయిన వైసీపీ. ఇందుకోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ వీలైనంత ఎక్కువగా హామీల వర్షం కురిపిస్తున్నారు. అప్పుడే ఎన్నికల ప్రచారసభలను తలపించేలా పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే నవరత్నాలు పేరిట హామీలు ప్రజల్లో బాగా మంచి స్పందన వచ్చిందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. అంతేకాదు .. వీలునుబట్టి కొత్త హామీలు కూడా ఇస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో అలాంటి మరో భారీ బంపర్ ఆఫర్ ప్రకటించారు.
వెయ్యి రూపాయల బిల్లు దాటిన ప్రతి వైద్య ఖర్చునూ ఆరోగ్య శ్రీ ఖాతాలోకే వెళ్లిపోతాయట. ఇప్పటివరకూ ఆరోగ్య శ్రీలో కొన్ని పరిమితమైన రోగాలకే చికిత్స ఉంది. అంతేకాదు.. ఈ వైద్యం పట్టణాల్లోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తిస్తుందట. ఇంకా.. చికిత్స తర్వాత వైద్యులు సూచించే విశ్రాంతి సమయంలోనూ ఇబ్బంది పడకుండా ఫించన్ తరహాలో సొమ్ము ఇస్తారట. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే రోగులందరికీ అన్నిరకాల జబ్బులను ఆరోగ్యశ్రీ ద్వారా నయం చేయించేలా చర్యలు తీసుకుంటామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దీర్ఘకాలిక జబ్బులు బారినపడిన వారికి నెలకు పదివేల రూపాయల ఫించను అందచేస్తామన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. కదిరిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ హామిలు ఇచ్చారు.