తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖలో చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడక ముందు ఆర్థికంగా చితికిపోయిన ఈ శాఖ ఇప్పుడు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. 14 నెలల కాలంలోనే 1,618 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదాచేసింది. ఆర్థిక క్రమశిక్షణ, అవినీతి అక్రమాలకు చెక్ పెట్టడం, దుబారాను తగ్గించటం, రైస్ మిల్లర్లు, కిరోసిన్ డీలర్లు, ఎఫ్సీఐ, కేంద్రం నుంచి రావాల్సిన పాత బకాయిలను వసూలు చేయటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించటం ద్వారా ఇది సాధ్యమైంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు పౌరసరఫరాలశాఖ పరిస్థితి అగమ్య గోచరంగా ఉండేది. ఏండ్ల తరబడి మిల్లర్ల వద్ద కోట్ల బకాయిలు పేరుకు పోయాయి. కేంద్రం నిధులను రాబట్టుకోవటంలో అలసత్వం ప్రదర్శించింది. దీనితో పౌరసరఫరాలశాఖ ఆర్థిక పరిస్థితి దిగజారింది. తీసుకొన్న అప్పులకు వడ్డీలు చెల్లించటమే భారమైంది. రవాణా విధానంలో లోపాలు, సమన్వయ లోపం శాపంగా మారాయి. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సూచన మేరకు పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్ సీవీ ఆనంద్ వినూత్న చర్యలు, విప్లవాత్మక నిర్ణయాలు అమలుచేశారు.
నిత్యావసర సరుకుల జమాఖర్చులు, సీఎంఆర్, బాయిల్డ్ రైస్ బిల్లుల వసూళ్లలో పారదర్శకత, గోనె సంచుల కొనుగోళ్లు-తరలింపులో నూతన విధానం అమలు, ఎంఎల్ఎస్ పాయింట్లు, బ్యాంకుల వద్ద రోజువారీ లావాదేవీల నమోదు తదితర చర్యలు చేపట్టారు. ప్రయాణాలు, వ్యాపార ప్రకటనలు, కిరాయి ఖర్చులను తగ్గించటం, అనవసర ఖర్చులను నియంత్రించటం ద్వారా సంస్థకు 10 కోట్ల వరకు పొదుపు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, జీపీఎస్, సాంకేతిక విభాగాల ఏర్పాటు, పటిష్ఠ పర్యవేక్షణ వల్ల మరో 25 కోట్లు ఆదాచేశారు. ఆర్థిక విభాగం ఏర్పాటు, ఎప్పటికప్పుడు ఖాతాలను పునరుద్ధరించుకోవటం ద్వారా 75 కోట్ల వడ్డీభారాన్ని తప్పించారు. ఐదు ఎన్ఫోర్స్మెంట్ బృందాలు, సాంకేతిక విభాగం ఏర్పాటు వల్ల 30 కోట్లు ఆదా అయింది. మిల్లర్ల నుంచి 575 కోట్ల పాత బకాయిలు వసూలయ్యాయి.
ప్రభుత్వ వసతి గృహాలు, మధ్యాహ్నభోజనం వంటి కార్యక్రమాల కోసం రైస్ మిల్లర్లతో జరిపిన చర్చల ఫలితంగా 30.18 కోట్లు, దొడ్డు బియ్యం ద్వారా 80 కోట్లు ఆదాచేశారు. గోనె సంచులపై ప్రత్యేకముద్ర వేసి బియ్యం పక్కదారి పట్టకుండా నేరుగా పాఠశాలలకు రవాణా చేస్తున్నారు. 2008 నుంచి మిల్లర్ల వద్ద ఉన్న గోనె సంచులను రికవరీ చేయటం ద్వారా 84 కోట్లు వసూలయ్యింది. బియ్యం అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు గత ఏడాది ప్రవేశపెట్టిన ఈ పాస్ విధానం వల్ల 2016 ఆగస్టు నుంచి 2017 నవంబర్ వరకు 479.34 కోట్లు ఆదా అయింది. కేంద్రం నుంచి 249.72 కోట్లు బకాయిలు రాబట్టింది.