తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలు సిగ్గుపడేలా కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ శాసనసభ్యుడు గువ్వల బాలరాజు అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న విధానం బాగాలేదని…సభ్య సమాజం దాన్ని ఆమోదించదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బాలరాజు మాట్లాడుతూ రేవంత్ తీరుపై మండిపడ్డారు. ఇటువంటి నాయకుల వలన ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పలుచబడిందని అన్నారు.
ప్రధాని మోడీపై చేసిన హేయపూరిత వ్యాఖ్యలే ఫలితంగానే మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్‌ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందని పేర్కొంటూ నైతిక విలువలు ఉంటే రేవంత్ ను సస్పెండ్ చేయాలని బాలరాజు డిమాండ్ చేశారు. మణిశంకర్ అయ్యర్ ను సస్పెండ్ చేసి హుందాగా వ్యవహరించారు.. మరింత హుందాగా ఉండాలంటే సస్పెండ్ చేయాలని అన్నారు. `వెధవ మూర్ఖుడు రేవంత్.. ఓటుకు నోట్ కేసులో అడ్డంగా దొరికాడు. తారాచౌదరీతో ఈయనకు ఉన్న సంబంధించిన వ్యవహారాన్ని మేము మాట్లాడామా?` అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత కుమ్ములాటలు బయట పడుతున్నాయని బాలరాజు అన్నారు.
`నీ చరిత్ర అంత నాకు తెలుసు ..మంత్రి పై చేసిన వ్యాఖ్యలపై రేవంత్ ఆధారాలు ఉన్నాయా? లక్ష్మారెడ్డి త్యాగదనుడు తెలంగాణ ఉద్యమం కొరకు రాజీనామా చేసాడు. దమ్ము ఉంటే రాజీనామా చెయ్.. చూద్దాం ఎవరు గెలుస్తారో. ప్రజలు రేవంత్ రెడ్డిపై తిరగబడుతారు` అని బాలరాజు స్పష్టం చేశారు. `నా నియోజకవర్గంలో మాట్లాడుతూ నన్ను కూడా తొండలు ఎక్కించి కొడ్తాను అన్నాడు. బ్రోకర్ గిరి చేసి డబ్బులు సంపాదించావు. పిచ్చ కుంట్ల కులాన్ని కించపరిచారు వారిని అంటే ఉరుకోము. జడ్చర్లలో మల్లురవి కాదని నాకు టికెట్ వస్తదని ప్రచారం చేస్తున్నాడు.` అని వ్యాఖ్యానించారు. మాదిగలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని…వర్గీకరణకు తాము మద్దతు ఇచ్చామని తెలిపారు. ఢిల్లీకి అఖిలపక్షంతో వెళతామని…ప్రధాని మోడీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనిదమ్ముంటే బీజేపీ ప్రభుత్వంను అడగాలని అన్నారు.