రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం ఈ ఉదయం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.ఈ సందర్బంగా ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నాలుగు రోజుల పాటు బస చేయనున్నారు. ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ శివార్లలోని హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారని అధికారులు తెలిపారు. రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలుకనున్నారు. అక్కడి నుంచి ఆయన మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. రాష్ట్రపతి నిలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.ఈ నేపధ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ఆదివారం రాత్రి 7.30 గంటలకు విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు రెండు రాష్ర్టాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులను ఆహ్వానించించినట్టు రాజ్‌భవన్‌వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి నిలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తును పెంచారు. రాష్ట్రపతి కాన్వాయ్‌కి సంబంధించిన రిహార్సల్స్‌ను పోలీసులు పూర్తిచేశారు.