వారంలో రెండు రోజులు మటన్, ఐదు రోజులు చికెన్..ప్రతిరోజూ గుడ్డుతోపాటు స్వీటు, నెయ్యి…ఇదీ కార్పొరేట్ హాస్టల్లలోని మెనూ కాదు. కస్తూరిబా పాఠశాలల్లో త్వరలో అమలయ్యే మెనూ.. ఇప్పటికే సన్నబియ్యంతో భోజనం అందిస్తుండగా..ఇక కార్పొరేట్ విద్యాలయాలకు మిన్నగా అదిరిపోయే ఆహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మౌలిక వసతుల్లో లోటు లేకుండా వేడినీళ్ల కోసం సోలార్ గీజర్లను ఏర్పాటు చేయబోతున్నది. వచ్చే ఏడాది జనవరిలో ఈ మెనూ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేజీబీవీల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థినులు లబ్ధిపొందనున్నారు.
కడుపునిండా తింటేనే విద్యార్థులు బాగా చదువుకోగలుగుతారని, వారికి కొలతల ప్రకారం తిండి పెట్టడం ఏంటని ముఖ్యమంత్రి కేసీఆర్ హాస్టళ్ల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్న విషయం తెలిసిందే. అదే క్రమంలో వెనుకబడిన వర్గాల కుటుంబాలకు చెందిన బాలికలే అధికంగా ఉండే కేజీబీవీ విద్యాలయాలకు గతంలో ఉన్న మెనూను పూర్తిగా మార్చి వేస్తూ వారం రోజులు మాంసాహారం పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోగా జనవరి 1, లేదా సంక్రాంతి నుంచి కొత్త మెనూను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం విద్యార్థులకు వారంలో ఒక రోజు చికెన్, ఐదు రోజులు గుడ్డు పెడుతున్నారు. కాగా కొత్తగా అమలు చేయబోయే మెనూలో వారం మొత్తం 50 గ్రాముల చొప్పున మాంసాహారం వడ్డిస్తారు. వారంలో రెండు రోజులు మటన్, ఐదు రోజులు చికెన్‌తోపాటు రోజూ గుడ్డు, స్వీటు ఇస్తారు. తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర కేజీబీవీ విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.