బాక్సాఫీస్ వద్ద వరుసబెట్టి ఏడు హిట్ సినిమాలున్న నాని ఎనిమిదవ సినిమాకి ఆకాశమంత క్రేజ్ రావడం, భారీ ఓపెనింగ్స్ రావడం అనేది సర్వసాధారణం. అయితే అదేదో గొప్పదనమని ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు. సినిమా చూసినవాళ్లలో ఒక 20 శాతం లేదా 30 శాతం మంది బాలేదు అంటే.. మిగతా వారికి నచ్చింది అనుకోవచ్చు. అయితే నాని నుండి వచ్చిన తాజా ఎంసీఏ చిత్రం ఏకగ్రీవంగా 70 శాతం పైగా జనాలు సినిమా బాలేదని తేల్చి చెప్పేయడంతోపాటు నాని ఇకనుంచైనా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని.. ఇది నానికి డేంజర్ సిగ్నల్ ప్రేమగా వార్నింగులు ఇస్తున్నారు ప్రేక్షకులు.
ఇక దర్శక నిర్మాతల విషయానికి వస్తే.. వారు మాత్రం ప్రేక్షకులు చెప్పిన విషయాల్ని ఖాతరు చేయకుండా మా సినిమా అన్ని కోట్లు కలెక్ట్ చేసింది, ఇంత షేర్ వచ్చింది అంటూ బ్లాక్ బస్టర్ అని ప్రమోట్ చేసుకొంటున్నారు. సినిమాకి డబ్బులు రావడానికి, హిట్ అవ్వడానికి చాలా తేడా ఉంది. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ కూడా 90 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. అలాంటిది వరుస విజయాల జోరుమీదున్న నాని సినిమా మొదటిరోజు లేదా మొదటివారం భారీ కలెక్షన్స్ రాబట్టడం అనేది ప్రస్తుతం దిల్ రాజు అండ్ టీమ్ చేస్తున్న ప్రమోషన్ష్కి అంత కష్టమేమీ కాదు. మరి ఎందుకీ మోకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ప్రేక్షకుల్ని ఎలాగూ మోసం చేస్తూనే ఉన్నారు. అలాగే తమని తాము ఎందుకు మోసం చేస్తున్నారు.
ఇంకా ఏమైనా అంటే ఈ రివ్యూ రైటర్ల వల్ల సినిమా చచ్చిపోతోందని పబ్లిక్‌గా కామెంట్స్ చేసే నిర్మాతలు. అదే రివ్యూ రైటర్ల కారణంగా తమ సినిమాల కలెక్షన్స్ పెరిగినప్పుడో మంచి టాక్ వచ్చినప్పుడో ఎందుకని కనీసం వారికి కృతజ్ఙతలు కూడా చెప్పడం లేదు. ఒక మంచి సినిమా బాలేదు అని వంద మంది చెప్పినా ఆ సినిమాకి చెడు జరగదు. అలాగే ఒక చెత్త సినిమాని వెయ్యి మంది బాగుందని ప్రచారం చేసినా.. ప్రేక్షకులు ఒక్కసారి సినిమా చూసి బాలేదని డిసైడ్ అయ్యారంటే కోట్లు ఖర్చు చేసి పబ్లిసిటీ చేసినా థియేటర్ల వద్దకి ప్రేక్షకులను తీసుకురాలేరు. మరి స్టేజ్ మీద మాట్లాడే టప్పుడు మాత్రం ప్రేక్షక దేవుళ్లు అంటూ సినిమా డైలాగులు చెప్పి.. చెత్త సినిమాలను జనాల మీదకు వదిలి.. దిక్కుమాలిన ప్రమోషన్లు చేస్తే.. ప్రేక్షకులు కూడా అలాగే దెబ్బ వేయాల్సి వస్తోందని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.