క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్‌పై మరోమారు భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తన సానుభూతి తెలిపారు. హైదరాబాద్ రామంతాపూర్ హోమియోపతి మెడికల్ కాలేజీ లో స్వర్ణోత్సవ సంబురాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.ఆయుష్ మందుల ప్రాధాన్యతను గుర్తించారు కానీ తగిన గౌరవం ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకు రాజకీయ కారణాలు ఏమి లేవని…అవగాహన రాహిత్యం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. మన ఆలోచన జీవన విధానాల్లో మార్పులు రావాలని ఆకాంక్షించారు. మనసు, ఆలోచనల్లోనూ మార్పులు వచ్చాయని…శారీరక శ్రమ తగ్గింది ఆధునికత, యాంత్రీకరణ వచ్చిందని భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు.
శరీరం, మనసు అదుపు తప్పే పరిస్థితులు వచ్చాయని మానసిక సంతులనం అవసరమని పేర్కొన్నారు. సమాజంలో విలువలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల్లో కూడా ఇదే కనిపిస్తోందన్నారు. `పాపం సచిన్ టెండూల్కర్…నిన్న పార్లమెంట్‌లో మాట్లాడేందుకు సిద్ధమవుతుండగా…ఆయనకు ఆ చాన్స్ దక్కనివ్వలేదు` అని పేర్కొన్నారు. మంచి ఆరోగ్యం ఉంటే ఆదాయాలు పెంచుకోవచ్చునని…ఆదాయం ఉన్నంత మాత్రాన ఆరోగ్యాన్ని సంపాదించలేమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వైద్య రంగాన్ని అత్యంత ప్రాధాన్యతతో అభివృద్ధి పరుస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో వైద్య రంగం అభివృద్ధి సాధ్యం అవుతోందన్నారు. కొత్త హోమియో మెడికల్ కాలేజీ ఏర్పాటు పై సీఎం గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. జిల్లా కేంద్రాల్లో ఆయుష్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. హోమియో విభాగాలు కూడా అదనంగా ఉండే విధంగా ప్రజల డిమాండ్ మేరకు నిర్ణయిస్తామని తెలిపారు. ప్రజలు హోమియోపతి వైద్యం పట్ల ఆసక్తిగా ఉన్నారని వెల్లడించారు.