వచ్చే ఏడాది జవనరి 31 నుంచి ప్రారంభం కానున్న సమ్మక్క – సారలమ్మ జాతర ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, చందులాల్, అధికారులు హాజరయ్యారు. జాతర నిర్వహణ, సౌకర్యాలు, వసతుల కల్పనపై అధికారులతో మంత్రులు చర్చించారు.
ఈ జాతరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాలు, దేశాల నుంచి దాదాపు కోటి మందికి పైగా భక్తులు వస్తారని మంత్రులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. మేడారం జాతరను గతంలో కంటే ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జనవరి 31న జాతర ప్రారంభం కాబోతున్నందున.. 15వ తేదీ వరకు జాతర పనులన్నీ పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.
జాతర పనులను వీలైనంత వరకు స్థానికులకే అప్పగించాలని సూచించారు. జనవరి 18న మేడారంలో మరోమారు సమీక్ష సమావేశం నిర్వహిస్తామని కడియం చెప్పారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతామని ఆయన తెలిపారు.మేడారం జాతర నిర్వహణకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 80 కోట్లు కేటాయించారని ఈ సందర్బంగా తెలిపారు .
మేడారం జాతర జనవరి 31 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు కొనసాగనుంది. 31న సారలమ్మ, ఫిబ్రవరి 1న సమ్మక్క గద్దెకు వస్తారు. 2వ తేదీన భక్తులు మొక్కులు చెల్లిస్తారు. ఫిబ్రవరి 3న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారు.