తెలంగాణ ప్రభుత్వంపై మరో ప్రఖ్యాత వేదిక ప్రశంసలు కురిపించింది. సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) ప్రతినిధులు మన రాష్ర్ట ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న కార్యనిర్వాహక వర్గం సమావేశంలో పలువురు ప్రతినిధులు మాట్లాడారు. నగరంలోని బిర్యానీ, ఆతిథ్యం బాగున్నాయని, అంతకు మించి తెలంగాణ పాలసీలు మరింత బాగున్నాయని కొనియాడారు.
దేశంలో ఏడాదికి 28 లక్షల వాహనాలు తయారవుతున్నాయని, ఇందులో 25 లక్షల వాహనాలు స్థానికంగా అమ్ముడవుతున్నాయని సియామ్ ప్రతినిధులు తెలిపారు. గత కొన్ని దశాబ్దాలుగా కేంద్రం అందిస్తున్న పాలసీ మద్దతుతో ఆటోమొబైల్ రంగంలో దేశ వ్యాప్తంగా కొన్ని తయారీ కేంద్రాలు ఏర్పడ్డాయన్నారు. తెలంగాణను ఒక డైనమిక్ స్టేట్ గా చూస్తున్నామని మంత్రి కేటీఆర్ కు సియామ్ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ పాలసీలను తాము ఇప్పటికే గుర్తించామని, పెట్టుబడులకు ఊతం అందిస్తున్న తీరు, మద్దతుపైన మంత్రికి అభినందనలు తెలిపారు. తెలంగాణ అభివృద్ది రేటును ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఆటోమొబైల్ రంగ అభివృద్దికి తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు సియామ్ ప్రతినిధులు. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలను వారు అభినందించారు. పాలసీల రూపకల్పనలో రాష్ర్ట ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. ఎలక్ర్టిక్ మొబిలిటీ రంగ అవకాశాలపైన సియామ్ ఆశావాహంగా ఉన్నదని, ఈ ప్రయత్నాలకు ప్రభుత్వాల పాలసీ మద్దతు కోరుతున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో క్లీన్ టెక్నాలజీ ఆధారిత ఎలక్ర్టికల్, హైబ్రిడ్ వాహనాలదే కాలమని మంత్రి కేటీఆర్ కు సియామ్ ప్రతినిధులు తెలిపారు.