ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా సాగాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా పడటం కొందరు నిరసన కారులకు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు అందివచ్చిన అవకాశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సదస్సు వాయిదా వివిధ అంశాలకు ముడిపెట్టి విమర్శలు చేస్తున్నవారు తెలుసుకోవాల్సిన నిజం తెరమీదకు వచ్చింది. వచ్చేనెల 3 , 7 తేదీల మధ్య హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో జరుగాల్సిన సైన్స్ కాంగ్రెస్ 105వ వార్షిక సమావేశం ఇప్పటికే వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీనిపైఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఐఎస్‌సీఏ) కార్యవర్గ సమావేశం వివరణ ఇచ్చింది.
ప్రధాని నరేంద్రమోడీ పర్యటనకు, సదస్సు వాయిదాకు సంబంధం లేదని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉస్మానియా యూనివర్సిటీ విజ్ఞప్తి, ఐఎస్‌సీఏ సిఫారసుల మేరకు ఓయూలో సైన్స్ కాంగ్రెస్ నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. కానీ యూనివర్సిటీ క్యాంపస్‌లో నెలకొన్న పరిస్థితుల వల్ల ఈ సమావేశాలను నిర్వహించలేమని ఈ నెల 19న ఓయూ అధికారులు తమకు సమాచారం ఇచ్చారని ఐఎస్‌సీఏ పేర్కొంది.వచ్చే బుధవారం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఐఎస్‌సీఏ) కార్యవర్గ సమావేశం దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.