వైకాపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై సీబీఐ, ఈడీ నమోదు చేసిన ఛార్జీషీటులన్నీ వీగిపోనున్నాయా..? సీబీఐ నమోదు చేసిన కేసులన్నింటిలో వైఎస్ జగన్ నిర్దోషిగా బయటకు రానున్నారా..? పలుకుబడిని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ జగన్ కు ప్రజల్లో పెరుగుతున్న ప్రజాదరణను చూసి కక్షకట్టి పలు పార్టీల వారు జగన్‌పై పెట్టిన కేసుల దృష్ట్యా కోర్టుమెట్లెక్కిన జగన్.. ఇప్పుడు ఆ కేసులన్నింటిని దాటుకుని.. జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారా..? ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
రాజకీయ విశ్లేషకుల మాటలకు అర్థం లేకపోలేదు. కాగా, యూపీఏ ప్రభుత్వ హయాంలో 2జీ స్పెక్ర్టం కుంభకోణంలో సీబీఐ, ఈడీలు రంగంలోకి దిగి డీఎంకే నేతలు రాజా, కనిమొళి సహా 17 మందిపై, అంతేగాక పలు కార్పొరేట్ సంస్థలపై ఛార్జ్‌షీట్ నమోదు చేసిన విషయం విధితమే. అయితే, నిన్నటికి నిన్న ఈ కేసును విచారించిన పాటియాల ప్రత్యేక కోర్టు 2జీ స్పెక్ర్టం కుంభకోణంలో సీబీఐ, ఐటీ నిందితులుగా చేర్చిన వారందరిని నిర్దోషులుగా ప్రకటించిన విషయం విధితమే.
అయితే, ఇప్పుడు ఈ వార్త ఏపీలో ట్రెండింగ్ అవుతోంది. 2జీ స్ర్పెక్ర్టం, జగన్ కేసులను పోలుస్తూ ప్రజలు చర్చించుకుంటున్నారు.అప్పట్లో జగన్ తమను ధిక్కరించడంతో కాంగ్రెస్ అధిష్టానం కేసులు నమోదు చేయించిన విషయం కాదనలేని సత్యం. పైగా జగన్ మీద ఫిర్యాదు చేసిన శంకర్రావు సహా ఆనాటి కాంగ్రెస్ నేతలు సాయి ప్రతాప్, డీఎల్ రవీంద్రారెడ్డి వంటి వారు అనేక మంది ఇప్పటికే ఆ విషయం స్పష్టం చేసేశారు కూడా. అప్పట్లో ఆ కేసులను ఉపయోగించుకుని జగన్ ని జైలు పాలుజేయడమే కాకుండా, రాజకీయంగానూ దెబ్బకొట్టే ప్రయత్నం జరిగింది. టీడీపీ, కాంగ్రెస్ కలిసి సాగించిన ప్రచారం, దానికి తగ్గట్టుగా నాటి సీబీఐ అధికారుల తీరు కూడా కలిసి జగన్ ని కోర్టు ముందు దోషిగా నిలబెట్టాయి. అయినా ప్రజలు అవి అక్రమ కేసులనే విషయాన్ని గ్రహించడంతో ఆయన పార్టీ పెట్టిన స్వల్పకాలంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన మూడూ కలసి ఒక కూటమిగా వచ్చినా ఒంటరిగా పోరాడి స్వల్పతేడాతో అధికారం కోల్పోయారు.
ఇక ప్రస్తుతం జగన్ కేసుల్లో అనేకం ఇప్పటికే క్లారిటీకి వచ్చేశాయి. 12 ఛార్జిషీట్లకు సంబంధించి పలువురు అధికారులకు విముక్తి లభించింది. పారిశ్రామికవేత్తలు కూడా ఊరట పొందుతున్నారు. తద్వారా ప్రభుత్వంలో ఉండి ప్రయోజనాలు అందించిన వాళ్లు, పొందిన వాళ్లు దోషులు కానప్పుడు ఇక సర్కారులో ఎటువంటి పాత్ర లేని జగన్ దోషి ఎలా అవుతారనే ప్రశ్న ఉద్భవిస్తోంది. దాంతో సీబీఐ కూడా జగన్ కేసుల్లో నిరాధార ఆరోపణలు చేసినట్టు అందరికీ అర్థమవుతోంది. ఇక దానికితోడు జగన్ మాత్రం న్యాయస్థానాల మీద నమ్మకంతో పాదయాత్ర వంటి ప్రధాన కార్యక్రమం ఉన్నప్పటికీ ప్రతీవారం కోర్టుకి హాజరవుతూ వ్యవస్థల మీద విశ్వాసం ప్రకటిస్తున్నారు. ఓ వైపు చంద్రబాబు వరుసగా తన మీద కేసులలో స్టే లు తెచ్చుకుంటూ విచారణను అడ్డుకుంటుంటే జగన్ మాత్రం విచారణ వేగవంతం చేయడానికి తగ్గట్టుగా సహకరిస్తూ ముందుకు సాగుతున్న తీరు ఆయన నైతిక స్థైర్యానికి నిదర్శనంగా భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో 2జీ కేసులో తీర్పు గమనిస్తే కనిమొళి, రాజా వంటి వారికే ఊరట లభించిన నేపథ్యంలో జగన్ కి కేసుల నుంచి విముక్తి పెద్ద సమస్య కాబోదని భావిస్తున్నారు. త్వరలోనే వైసీపీ అధినేత నిర్దోషిగా బయటపడే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. కాగ్ నిర్ధారించిన అంశంలోనే అధారాలు సేకరించలేని సీబీఐ, నిరాధారాలతో నమోదు చేసిన కేసులో ప్రోసిక్యూషన్ సందర్భంగా పక్కాగా వ్యవహరించగలిగే అవకాశం లేకపోవడం దానికి కారణం. లక్ష కోట్లు అంటూ చంద్రబాబు, ఆయన సానుకూల మీడియా సాగించిన ప్రచారం చివరకు 1200 కోట్ల రూపాయల అవినీతి అంటూ నమోదు చేసిన ఛార్జిషీట్లు కూడా నిలబడే అవకాశం ఉండదనే అంచనాలు పెరుగుతున్నాయి. దాంతో పటియాల ప్రత్యేక కోర్టు తరహాలోనే నాంపల్లి సీబీఐ కోర్ట్ తీర్పు ఉంటుందనే ఆశాభావం అనేక మందిలో వ్యక్తమవుతోంది.