తెలంగాణ రాష్ట్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో పర్యటించారు . పర్యటనలో భాగంగా జిల్లాలోని నేలకొండపల్లిలోని సింగారెడ్డిపాలెంలో పేదల కోసం 30 ఇళ్లకు శంకుస్థాపన చేయగా, నిర్మాణం పూరైన 18 డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడారు .. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉన్నంత వరకు ప్రజల కోసమే పని చేసి న్యాయం చేస్తానని, అభివృద్ధి తప్ప నాకు మరో ఆలోచన లేదని అన్నారు.
తెలంగాణ బిడ్డ పుట్టి మూడున్నరేళ్లు మాత్రమే అయ్యిందని, అయినప్పటికీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేపడుతున్నారన్నారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం రూ.18వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.అర్హులైన ప్రతీ పేదవారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో పాలేరు 30ఏళ్లుగా అభివృద్ధిలో వెనుకబడి ఉందని తెలిపారు. అటువంటి పాలేరులో అభివృద్ధి చేసే అవకాశాన్ని ప్రజలు నాకు కల్పించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తల తాకట్టుపట్టైన అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, ఐడీసీ చైర్మన్ బేగ్, జడ్పీ చైర్‌పర్సన్ కవిత తదితరులు పాల్గొన్నారు.