2014 ఎన్నికల్లో చంద్రబాబు బూటకు హామీలను నమ్మి.. టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు.. తీరా తాము చంద్రబాబును నమ్మి మళ్లీ మోసపోయామని గుర్తించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అంతేగాక గత సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ స్వల్ప మెజార్టీతో, అమలు కాని హామీలను గుప్పించి గెలిచి అధికారాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే, ఈ సారి బూటకపు హామీలు గుప్పించే పార్టీపై ప్రజలు వారి ఓట్లతో సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డిలాంటి పాలన కోరుకుంటున్నారు. అందులో భాగంగానే టీడీపీని నమ్మి మోసపోకూడదనే ఆలోచనలో ఉన్నారు ఏపీ ప్రజలు.
అలాగే, మరోపక్క ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన పాదయాత్రతో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ…నిత్యం ప్రజల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో జగన్ నాయకత్వంలో వైసీపీ అధికారం చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే టీడీపీపై ప్రజల్లో వ్యతిరేక భావం ఉందని గమనించిన పలువురు సినీ ప్రముఖులు, టీడీపీ నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వారిలో ముఖ్యంగా నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
అందుకు కారణం టీడీపీలో హరికృష్ణకు ప్రాధాన్యత తగ్గడం, 2014 ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించినా.. హరికృష్ణకు చంద్రబాబు విముఖత చూపడం, కనీసం టీటీడీ చైర్మన్ పదవిని కూడా తనకు కేటాయించకపోవడంతో హరికృష్ణ, చంద్రబాబుల మధ్య మళ్లీ విబేధాలు తలెత్తిన మాట వాస్తవం.దీంతో అవమానాలను తట్టుకోలేని హరికృష్ణ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని అటు వైసీపీ వర్గాల్లోను, ఇటు టీడీపీ వర్గాల్లోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ హరికృష్ణ వైసీపీలో చేరితో హిందూపురం నుంచి పోటీచేసే అవకాశం ఉందని సమాచారం.