తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయభూముల రికార్డుల ప్రక్షాళన దాదాపు పూర్తిచేసిన ప్రభుత్వం ఇక పట్టణాల్లోని భూములు, ఇండ్ల సర్వేపై దృష్టిపెట్టింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రాజధాని హైదరాబాద్ సహా పట్టణాల్లోని భూములు, ఇండ్ల రికార్డులను పక్కాగా రూపొందించాలని నిర్ణయించింది. దీనిపై హైదరాబాద్ కలెక్టర్, రెవెన్యూ అధికారులతో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. భూరికార్డుల ప్రక్షాళనలో పట్టణ ప్రాంతాల్లో ఏ విధానాన్ని అనుసరించాలి? ప్రక్షాళన సందర్భంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి? అనే దానిపై ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఖాళీ భూములు చాలా తక్కువగా ఉన్నాయి.
అవికూడా ఎక్కువగా ప్రభుత్వ భూములే. వీటితోపాటు, ప్రైవేటు భూములకు సంబంధించి పూర్తి సమాచారం రికార్డుల ప్రక్షాళనలో బయటపడనుంది. అలాగే, రాజధానిలో వ్యక్తిగత నివాసాల కంటే అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలే అధికంగా ఉన్నాయి. ఒక్కో అపార్ట్‌మెంట్, అందులో ఉన్న ఫ్లాట్ల సంఖ్యను బట్టి యజమానులు ఉంటారు. ఈ అపార్ట్‌మెంట్ రికార్డులను ఏ విధంగా సరిచేయాల్సి ఉంటుంది? అనేదానిపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.
భూమి యజమానితో ఒప్పందం చేసుకుని బిల్డర్ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తారు. జాయింట్ అగ్రిమెంట్‌తో భవనాన్ని నిర్మించి ఇతరులకు విక్రయిస్తారు. ఇలా కొనుక్కున్న ఫ్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేయించుకుని జీహెచ్‌ఎంసీలో మ్యుటేషన్ చేయించుకుని ఇంటిపన్ను చెల్లిస్తారు. వీటికి సంబంధించిన రికార్డులన్నీ పురపాలక సంస్థల్లో ఉంటాయి. హైదరాబాద్‌లో అయితే జీహెచ్‌ఎంసీలో ఉంటాయి. వీటి రికార్డుల ప్రక్షాళన చేయాల్సి వచ్చినప్పుడు, ముందు భూమి స్వభావం ఏమిటి? భూ యజమాని ఎవరు? అనే రికార్డును పరిశీలించాలి. దానిని ధ్రువీకరించుకున్న తరువాత భవనాన్ని నిర్మించిన బిల్డర్ ఎవరు? ఏ విధంగా విక్రయించారనేది పరిశీలించి రికార్డును పక్కాగా రూపొందించాల్సి ఉంటుందని భావించినట్టు తెలిసింది. ఇందుకు జీహెచ్‌ఎంసీ, ఇతర పురపాలక సంస్థల అధికారులతో కలిసి సర్వే నిర్వహించాలని అభిప్రాయపడినట్టు తెలిసింది.