మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌కు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి అన్నివిధాల సహకారం అందిస్తామన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) కార్యనిర్వాహక వర్గం సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఆటో కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోషియేషన్ ప్రతినిధులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ర్టంలో ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులకున్న అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. గత మూడేళ్లలో సాధించిన ప్రగతి, ఆకర్షించిన భారీ పెట్టుబడులు, తెలంగాణ పారిశ్రామిక విధానం గురించి సియామ్ ప్రతినిధులకు తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందున్న విద్యుత్ సంక్షోభం, ప్రస్తుతం పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందిస్తున్న తీరుని మంత్రి విపులీకరించారు. రాష్ర్టంలో పరిశ్రమలకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్ సరఫరాకు ఎలాంటి కొరత లేదన్నారు.
ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అవసరమైన కార్మికులకు ప్రభుత్వ ఖర్చుతో టాస్క్ ద్వారా శిక్షణ ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమన్నారు. రాష్ర్టంలో ఇప్పటికే ఆటోమొబైల్ యాన్సిలియరీ కంపెనీలు ఉన్నాయన్నారు. ఎంఆర్ఎఫ్, మహింద్రా వంటి కంపెనీలు, జడ్ యఫ్ ( ZF) వంటి అంతర్జాతీయ సంస్ధలు తెలంగాణ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నారు.
ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి అన్ని రకాల సహకారాలు అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. పరిశోధన, ఇన్నోవేషన్ రంగాల్లో ముందంజలో ఉండేందుకు మొబిలిటీ రీసెర్చ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఆటోమొబైల్ రంగ అభివృద్దికి ఊతం ఇచ్చేందుకు అవసరం అయిన విధాన రూపకల్పనలో సియామ్, అక్మా సంస్ధలతో కలసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.