దేశరాజధానిలోని ఆధ్మాత్మిక ముసుగులో దారుణాలను పాల్పడుతున్న బాబా వీరేందర్ దేవ్ దీక్షిత్ ఆశ్రమంపై దాడి సందర్భంగా భయానక దృశ్యాలు బయటపడ్డాయి. బోనుల్లాంటి గదుల్లో బంధించి శారీరకంగా, మానసికంగా హింసిస్తున్న దృశ్యాలు దర్శనమిచ్చాయి. పోలీసుల సహకారంతో మహిళా కమీషన్ సుమారు 41 మంది అమ్మాయిలకు విముక్తి కలిపించింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో వీరేందర్‌కు చెందిన ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఉంది. ఈ ఆశ్రమంపై గత కొన్నాళ్లుగా ఆరోపణలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున్న సెక్స్ రాకెట్ నడుపుతున్నాడంటూ దీక్షిత్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలతో నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా బంధించిన అమ్మాయిలకు విముక్తి కలిపించారు. వీరేంద్రను తక్షణమే అరెస్ట్ చేయాలని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ డిమాండ్ చేస్తున్నారు.
తనపై బాబా వీరేంద్ర లైంగికదాడికి పాల్పడినట్లు ఓ మహిళ ఫిర్యాదు చేయటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సుమారు 100 మందికి పైగా మహిళలు ఆశ్రమంలో బందీలుగా ఉన్నారని.. వారిని జంతువుల్లా హింసిస్తున్నారని అడ్వొకేట్ నందిత రావ్ కోర్టుకు వివరించారు. పెద్ద ఎత్తున్న అమ్మాయిలతో ఆశ్రమంలోనే సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని ఆమె వాదన వినిపించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు సీబీఐకి సోదాలు నిర్వహించాల్సిందిగా బుధవారం ఆదేశించింది.
బయటి ప్రపంచానికి తాము సాధ్వీలుగా కనిపించినప్పటికీ.. లోపల మాత్రం తాము నరకం అనుభవించేవాళ్లమని.. విషయం బయటికి తెలిస్తే ప్రాణాలు తీసేస్తామని వీరేందర్.. ఇప్పటిదాకా 16,000 మందికి పైగా మహిళలపై ఆ కిరాతకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆమె చెబుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీరేందర్ కోసం వెతికే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు.