హైదరాబాద్ బిర్యానీ ఖాతాలో మరో ప్రత్యేకత నమోదైంది. శతాబ్ధాలు గడిచినా హైదరాబాదీలకు బిర్యానీ మీద మోజు తీరలేని మరోమారు రుజువైంది. దేశ ప్రథమ పౌరుడు సైతం హైదరాబాద్ అంటే బిర్యానీ అని కొనియాడాడంటే ఈ సంప్రదాయ వంటకానికున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి విశ్లేషణ అదే విషయాన్ని రుజువు చేస్తోంది. నగరవాసులు అత్యధికంగా బిర్యానీనే ఆర్డర్ చేస్తన్నారని గత ఏడాది ఆర్డర్లను విశ్లేషించి వెల్లడించింది. బిర్యానీ తరువాత అత్యధికులు పిజ్జాను గురించి వెతుకుతున్నారని స్విగ్గి విశ్లేషణ చెబుతోంది.
గత ఏడాది కాలంలో దేశ ప్రజలు ఎలాంటి రుచులపై ఆసక్తికనబరిచారో తెలుసుకునేందుకు స్విగ్గి వేరు వేరు నగరాల్లోని తమకు వచ్చిన ఆర్డర్స్‌ని విశ్లేషించింది. బెంగుళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కట, చెన్నై, పూనే నగరాల్లో 2017లో వచ్చిన ఆర్డర్స్‌ని విశ్లేషించింది. కాగా మెజార్టీ వినియోగదారులు దేశీయ సంప్రదాయ రుచులపై ఎక్కువ ఆసక్తి కనబరచడం విశేషం. దేశవాసులు ప్రధానంగా చికెన్ బిర్యానీ ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారని స్విగ్గి తెలిపింది. మసాలా దోశ, బట్టర్ నాన్, తందూరి రోటి, పనీర్ బటర్ మసాలా గత సంవత్సరం ఎక్కువగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్‌గా ఉన్నాయి. కాగా పిజ్జా గురించి అత్యధికులు సెర్చ్ చేసినట్లు స్విగ్గి తెలిపింది. గత సంవత్సరంలో 5లక్షల సార్లు పిజ్జా సెర్చ్ చేసినట్లు వెల్లడించింది.
స్విగ్గి విశ్లేషణ ప్రకారం లంచ్‌లో మసాల దోశ, ఇడ్లీ, వడ వంటి రుచుల్ని భారతీయులు ఎక్కువగా బ్రేక్ ఫాస్ట్‌లో ఇష్టపడుతున్నారు. లంచ్, డిన్నర్ మాత్రం అత్యధికంగా బిర్యానీ మెజార్టీ మొగ్గుచూపుతున్నట్లు స్విగ్గి తెలిపింది. స్నాక్స్ విషయంలోనూ దేశీయ రుచులకే ఇండియన్స్ ప్రాధాన్యత ఇస్తుండడం గమనార్హం. స్నాక్స్ ఆర్డర్ చేసేవారిలో పావ్ భాజి, సమోస, చికెన్ రోల్స్, చికెన్ బర్గర్, బేల్ పూరి వంటి వంటకాన్ని ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. లేట్ నైట్ ఆర్డర్ చేసే వారిలోనూ చికెన్ బిర్యానీ, బటర్ చికెన్, స్వీట్ ఐటమ్స్, చాక్లెట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. కాగా లేట్ నైట్ ఆర్డర్ చేసేవాళ్లలో హైదరాబాదీలో అత్యధికంగా ఉండడం గమనార్హం. తరువాత స్థానంలో బెంగుళూరు, ఢిల్లీ నగరాలున్నట్లు స్విగ్గీ తెలిపింది.
నగరవాసులు అత్యధికంగా బిర్యానీయే ఆర్డర్ చేస్తున్నట్లు స్విగ్గీ విశ్లేషణలో వెల్లడైంది. నగరంలో జూన్ నుంచి అక్టోబర్ వరకు అత్యధికంగా బిర్యానీ కొనుగోలు చేసినట్లు స్విగ్గీ తెలిపింది. చికెన్ బిర్యానీతో పాటు 20 రకాల ఇతర బిర్యానీలను హైదరాబాదీలు స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. నగరంలో మాదాపుర్, బంజారాహిల్స్, కొండాపుర్ నుంచి ఎక్కువగా ఆర్డర్స్ వస్తుండడం గమనార్హం.