తెలంగాణ రాష్ట్రం పై ఉత్తరాఖండ్ సహకారశాఖ మంత్రి డాక్టర్ ధన్‌సింగ్ రావత్ ప్రశంసల వర్షం కురిపించారు.రాష్ట్రంలో స్వచ్ఛత ఎక్కువ కనిపిస్తుందని తెలిపారు.కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని సహకార వ్యవస్థను ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా కంప్యూటరీకరించిన విధానాన్ని పరిశీలించేందుకు బుధవారం ఆయన జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా మానకొండూర్ మండలం గటుదుద్దెనపల్లి సహకార సంఘాన్ని సందర్శించారు. కోర్ బ్యాంకింగ్ సిస్టం ద్వారా సభ్యులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో మాదిరిగానే ఇక్కడ కూడా సహకార వ్యవస్థ బలోపేతంగా ఉందన్నారు.తమకన్నా వెనుక ఏర్పడిన రాష్ట్రం ఒక రంగంలో ఇంత అభివృద్ధి సాధించడం అభినందనీయమన్నారు. ఇక్కడిలాగే తమ రాష్ట్రంలోని సహకార సంఘాలన్నింటినీ కంప్యూటరీకరించాలనే ఉద్దేశంతోనే తాను తెలంగాణలో పర్యటిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం చాలా స్వచ్ఛతగా ఉందని, తనకు చాలా నచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ రాష్ట్ర ప్రొటోకాల్ మంత్రిని కూడా తానేననీ, ఇక్కడి వాళ్లు ఎవరైనా తమ రాష్ర్టానికి వచ్చినపుడు మంచి ఆతిథ్యం ఇస్తామని మంత్రి స్పష్టంచేశారు.
