దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో నిందితులు రాజా, కనిమొళిలు సహా అందరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ పటియాలా కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో పటియాలా హౌజ్ కోర్టు ఎదుట డీఎంకే నేతలు, పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. అయితే పటియాలా హౌస్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ, ఈడీ హైకోర్టులో అప్పీల్ చేయనుంది.2జీ స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల వల్ల రూ.1.76 లక్షల కోట్లు నష్టం ఏర్పడినట్లు కేంద్ర ప్రభుత్వానికి కాగ్ ఓ నివేదిక సమర్పించింది. భారీ మొత్తంలో కుంభకోణం కావడంతో సీబీఐ రెండు కేసులు పెట్టింది. దీంతోపాటు ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ)మరో కేసు నమోదు చేసింది. సీబీఐ పెట్టిన రెండు కేసుల్లో రాజా, డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి నిందితులుగా ఉన్నారు. వీరితోపాటు టెలికమ్యూనికేషన్స్ మాజీ కార్యదర్శి సిద్దార్థ్ బెహురా, రాజా మాజీ ప్రయివేటు కార్యదర్శి ఆర్కే సంతాలియా తదితర 14 మందిపై చార్జిషీటు దాఖలైంది. 2 జీ స్కాంపై 2011 నుంచి విచారణ కొనసాగుతూ వస్తున్నది.