తమిళనాడు రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. అందులోను ఆర్కేనగర్ పోలింగ్‌కు ఒక్క రోజు గడువు మాత్రమే ఉండటంతో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. కాగా, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కేనగర్ శాసనసభ సీటుకు ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆర్కేనగర్ సీటు కోసం అమ్మ అనుచరులమని చెప్పుకుంటూ ఓపీఎస్, ఈపీఎస్ వర్గం.. దినకరన్ వర్గం బరిలో దిగుతుండగా.. మరో వైపు తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం డీఎంకే బరిలో నిలిచిన విషయం తెలిసిందే.
ఆ విషయం కాసేపు పక్కనపెడితే.. తాజాగా దినకరన్ వర్గం విడుదల చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే, ఆ వీడియోలో జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. అమ్మ మరణం వెనుక తమవైపు నుంచి ఎలాంటి కుట్రలు లేవని, ఓటర్లకు తెలియజేసేందుకే దినకరన్ వర్గం ఈ వీడియోను విడుదల చేసిందని సమాచారం. తమ వద్ద జయలలిత చికిత్స పొందుతున్నప్పటి వీడియోలు ఉన్నాయని దినకర వర్గం గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే. కాగా, సరిగ్గా పోలింగ్‌కు ముందు రోజు ఈ వీడియో బయటకు రావడంతో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అమ్మ నిజమైన అనుచరులం మేమే..!!
ఆర్కేనగర్ ఉప ఎన్నికలో గెలుపు అవకాశం జయలలిత అనుచరులకే ఎక్కువ అన్న అంశం సర్వేలో వెల్లడి కావడంతో…. మేమే అమ్మ అనుచరలం.. కాదు.. కాదు మేమే అమ్మ అనుచరులమంటూ ఈపీఎస్, ఎపీఎస్ వర్గం, దినకరన్ వర్గం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, జయలలిత మృతి విషయంలో శశికలవర్గంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నది వాస్తవం. ఈ నేపత్యంలో జయలలితపై విచారణ కమిటీ కూడా వేసింది హైకోర్టు. ఇప్పుడు ఆర్కేనగర్ ఎన్నికల నేపథ్యంలో దినకరన్ వర్గం విడుదల చేసిన వీడియో ఆర్కేనగర్ ఉప ఎన్నికపై ఈ ప్రభావం చూపనుందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.