రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన కృషి ఫలిస్తోంది. ఐటీ, ఐటీ అనుబంధరంగాలతోపాటు మరిన్ని రంగాల్లో ఉద్యోగాల కల్పనకు రాష్ట్ర ఐటీశాఖ పరిధిలో ఆయన ఏర్పాటు చేసిన టాస్క్ శిక్షణ కృషి సఫలమవుతోంది. బ్యాంక్, బ్యాంక్ ఆధారితరంగాల్లో ఉద్యోగాల కల్పనకు టాస్క్ కుదుర్చుకున్న ఒప్పందం మొదటి శిక్షణలోనే పెద్ద ఎత్తున ఫలితాన్ని ఇచ్చింది. పలువురికి పలు ప్రముఖ బ్యాంకింగ్ సంస్థల్లో ఉద్యోగాలు దక్కాయి.
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ సర్టిఫికేట్ కోర్సును ప్రఖ్యాత బాంబే స్టాక్ ఎక్సేంజీ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు టాస్క్ ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం 380 గంటల పాటు టాస్క్, బీఎస్‌ఈ బృందాలు ఆయా అంశాలపై శిక్షణ ఇచ్చాయి. ఈ శిక్షణ పూర్తయినవారికి బీఎస్‌ఈ ఇనిస్టిట్యూట్ ఎండీ, సీఈవో అంబరీశ్ దత్తా, టాస్క్ సీఈవో సుజీవ్‌నాయర్ మంగళవారం టాస్క్ కార్యాలయంలో పత్రాలు అందించారు. ప్రముఖ బ్యాంకింగ్, ఆర్థిక సేవల సంస్థలైన స్టేట్ స్ట్రీట్, కాగ్నిజెంట్, కార్వీ, ఏడీపీ, హెచ్‌డీఎఫ్‌సీ, కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థల్లో 84 మందికి ఉద్యోగాలు దక్కాయి. ఈ ఉద్యోగాలు పొందినవారిలో ఎక్కువమంది జిల్లాల నుంచి వచ్చినవారే ఉండడం విశేషం. మహబూబ్‌నగర్, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మంతోపాటు హైదరాబాద్ జిల్లాల వారున్నారు.
సందర్భంగా టాస్క్ సీఈవో సుజీవ్‌నాయర్ మాట్లాడుతూ ఏటా దాదాపు రూ.3 లక్షల వేతనం, సంస్థలే రవాణా, భోజన సదుపాయం కల్పిస్తూ వీరిని నియమించుకోవడం తమ కృషికి దక్కిన ఫలితమన్నారు. బీఎస్‌ఈ సీఈవో అంబరీశ్ దత్తా మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగాల్లో ఉన్న విశేష అవకాశాలను ఒడిసిపట్టుకునేందుకు టాస్క్ ఒప్పందం కుదుర్చుకోవడం, ఆ శిక్షణను పూర్తిచేసినవారికి ఉద్యోగాలు దక్కడం సంతోషకరమన్నారు.