అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డిపై మేయర్ స్వరూప సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ దివాకర్ రెడ్డి రాక్షసుడంటూ ఆమె వ్యాఖ్యానించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ స్వరూప మాట్లాడుతూ.. చుట్టుపు చూపుగా 3 నెలలకు ఒకసారి నగరానికి వచ్చి తాము చేసిన అభివృద్ధి పనులను చూడకుండా విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన నల్ల అద్దాలు తీసి, తెల్లద్దాలు పెట్టుకోవాలని మేయర్ సూచించారు. ‘‘జేసీ దివాకర్ రెడ్డి ఎంపీ అయితే బాగుంటుందని మేము ప్రజల కాళ్లు పట్టుకుని ఓట్లు వేయించి గెలిపించాం. కానీ, ఇంత వరకు అనంతపురానికి అర్ధ రూపాయి కూడా ఆయన ఖర్చు పెట్టలేదు. తనకు వచ్చిన నిధులు కూడా ఖర్చు పెట్టలేదు. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటా అని చెబుతున్నారు. ఇలాంటి సమయంలోనైనా మంచి పనులు చేసి విశ్రాంతి తీసుకుంటే బాగుటుంది.’’ అని మేయర్ స్వరూప అన్నారు. తాము నగరాభివృద్ధికి ఇప్పటికే రూ.100 కోట్లను వెచ్చించామని, వాటిని చూసి మాట్లాడాలని ఆమె అన్నారు. ఆయన సూట్ వేసుకోవడమేకాదు… సూటయ్యే పనులు చేయాలని ఆమె ఘాటుగా విమర్శించారు. నగరాభివృద్ధికి అర్ధరూపాయి ఖర్చుపెట్టని ఎంపీ దివాకర్‌రెడ్డి విమర్శలు చేయడం తగదన్నారు
