రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో మంత్రి కేటీఆర్ రోజంతా బిజీబిజీగా గడపున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో మంత్రి కేటీఆర్ భేటి కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.30 కి కేంద్ర కామర్స్ & ఇండస్ట్రీస్ మంత్రి సురేష్ ప్రభుతో మంత్రి కేటీఆర్ సమావేశం అవుతారు. అనంతరం మధ్యాహ్నం 4.30 కి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి హర్ష వర్థన్ మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు.
కేంద్ర మంత్రులతో సాగే వరుస భేటీలలో రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలను మంత్రి కేటీఆర్ చర్చించనున్నారు. పలు అంశాలపై వినతిపత్రాలు అందించడంతో పాటుగా గతంలో ఇచ్చిన ప్రతిపాదనల వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం సాయంత్రం బిజినెస్ వరల్డ్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మంత్రి కేటీఆర్ అందుకోనున్నారు.
ఇప్పటికే పలు జాతీయ అవార్డులను దక్కించుకొన్న తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావుకు ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ ఏటా ఇచ్చే లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. నూతన రాష్ట్రాన్ని మంత్రి కేటీఆర్ దేశ యవనికపై తనదైన శైలిలో నిలిపిన తీరును బిజినెస్ వరల్డ్ అభినందించింది. పాలనాపరంగా ఆయన నిర్వహిస్తున్న బాధ్యతలు, రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నతీరు, దేశవ్యాప్తంగా మంత్రికి లభించిన పేరు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డు ఇస్తున్నట్టు బిజినెస్ వరల్డ్ తెలిపింది. మంత్రి కేటీఆర్‌కు లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటించిన బిజినెస్ వరల్డ్ సంస్థ ఈ నెల 20న స్మార్ట్, సేఫ్, సస్టైనబుల్ సిటీస్ అనే అంశంపై నిర్వహిస్తున్న ఐదో జాతీయ స్మార్ట్ సిటీ కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని ఆయనకు ఆహ్వానం పంపింది.