దేశమంతటా ఉత్కంఠ రేపిన గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రధాని మోదీ సర్కార్ నిర్ణయాలకు విషమ పరీక్షగా భావించిన ఈ ఎన్నికల్లో కమలం పార్టీ విజయకేతనం ఎగురవేసి విషయం తెలిసిందే . ఈ క్రమంలో ప్రస్తుత సీఎం విజయ్‌రూపానీ గెలిచినప్పటికీ ఆయన స్థానంలో ప్రజాకర్షక నేతనెవరినైనా ముఖ్యమంత్రిగా చేయాలని బీజేపీ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ రేసులో ముందంజలో ఉన్నట్టు సమాచారం. మంచి నాయకత్వ లక్షణాలు, గుజరాతీలో బాగా మాట్లాడగలిగే నేర్పు ఉన్న స్మృతి సీఎం అయితే రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు బాగుంటుందని బీజేపీ వర్గాలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో రెండోస్థానంలో మన్‌సుఖ్ ఎల్ మాండవ్య. మూడోస్థానంలో వాజుభాయ్ వాలా. మరోవైపు.. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ సీఎం పదవి కోసం బీజేపీ నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ ప్రకటించి మరీ రంగంలోకి దింపిన ప్రేమ్‌కుమార్ ధుమాల్ ఓడిపోయినప్పటికీ.. ఎలాగైనా ఆ పదవిని దక్కించుకునేందుకు మార్గాలు వెతుకుతున్నారు. అలాగే, కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేరు కూడా హిమాచల్ సీఎం అభ్యర్థిగా వినిపిస్తోంది.
