ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎల్బీస్టేడియంలో సినీ సంగీత విభావరి జరిగింది. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్, ఈటెల రాజేందర్, సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, రాజమౌళి, ఎన్ శంకర్, అల్లు అరవింద్, అశ్వినీదత్, పరుచూరి బ్రదర్స్, తనికెళ్ల భరణి, పోసాని మురళి కృష్ణ, కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, జమున, విజయనిర్మల, ప్రభ, జయసుధ, కోట శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్, సుమన్, విజయ్ దేవరకొండ, బ్రహ్మానందరం, తరుణ్ భాస్కర్, నారాయణమూర్తిలు హాజరయ్యారు.
స్వర్గీయ నటులు కాంతారావు, ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను గవర్నర్ నరసింహన్, కేటీఆర్ సన్మానించారు. కృష్ణ, జమునతో పాటు సిని నటులను అందరినీ సన్మానించారు.ఈ సందర్భంగా ప్రముఖ నటుడు కృష్ణ మాట్లాడుతూ తెలుగును ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అంటారని…తెలుగు భాష ఆధారంగానే తాను ఎన్నో సినిమాల్లో నటించగలిగానని తెలిపారు. తమను పిలిచి సన్మానించినందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రముఖ నటి జమున మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలు జలగం వెంగళరావు ఆధ్వర్యంలో జరిగాయని ఆ సందర్భాన్ని గుర్తుచేశారు. మర్చిపోతున్న తెలుగు భాష పునర్ వైభవం కోసం ఈ సభలు నిర్వహిస్తున్న ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. తెలంగాణ నుంచి ఎందరో మహా కవులు సినీ రంగానికి కృషి చేశారని జమున అన్నారు. సినీరంగంలో తెలంగాణ కవుల పాత్ర గొప్పదని కొనియాడారు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలుగు ప్రసంగం ఆకట్టుకుందని…ఎన్నో పద్యాలూ గుర్తుపెట్టుకొని వాటిని వివరించడం గొప్ప విషయమి కొనియాడారు. మంత్రి తారకరామారావు, ఎంపీ కవిత ఎంతో చక్కగా తెలుగు మాట్లాడతారని కొనియాడారు. తెలంగాణ నుండి తొలితరం హీరో కాంతారావు కుటుంబసభ్యులను సత్కరించడం బాగుందన్నారు.