వైఎస్ఆర్ కాగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 38వ రోజు అనంతపురం జిల్లా ధర్మవరంలో కొనసాగింది. డిసెంబర్ 18న ధర్మవరం నియోజకవర్గంలోని దర్శనమల నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర నడిమగడ్డపల్లె క్రాస్, బిల్వంపల్లి, నేలకోట, బుడ్డారెడ్డిపల్లి ఏలుకుంట్ల మీదుగా తనకంటివారిపల్లె మీదుగా సాగింది. ఈ సందర్భంగా స్థానికులు, గ్రామస్థులు, పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. యాత్రలో భాగంగా ధర్మవరం మండలం నడిమగడ్డపల్లె గ్రామస్థులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మమేకమయ్యారు. అనంతరం నేలకుంటతండాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
గ్రామస్థులు వారి సమస్యలను జగన్‌తో చెప్పుకున్నారు. రుణాలు మాఫీ కాలేదని, పింఛన్లు అందడం లేదని, ఫీజులు మంజూరు కావడంలేదంటూ తమ సమస్యలను జగన్‌కు వివరించారు. అలాగే గొర్రెల కాపరులు కూడా ఆయనను కలివారు. గొర్రెలు చనిపోతే ప్రభుత్వం ఇన్సురెన్సు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల వారి కష్టాలు తీరుతాయని పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని జగన్ హామీ ఇచ్చారు. వీటితోపాటు ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకం అమలు చేస్తామని, మహిళలకు డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని చెప్పారు వైఎస్ జగన్.