తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహాసభల ప్రధాన వేదిక అయిన లాల్ బహదూర్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ సభా వేదిక వద్దకు చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ మంగళవాయిద్యాల నడుమ రాష్ట్రపతిని సభా వేదిక వద్దకు తీసుకొచ్చారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ …మహాసభలు విజయవంత మైనందుకు ఆశించిన లక్ష్యన్ని సాధించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు .తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతో తెలంగాణ సాహిత్య అకాడమీ సంపూర్ణంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించిందని, ఈ తెలుగు ఉత్సవాలు ఇంతటితో ఆగిపోకుండా.. తెలుగు భాషకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తూ తన కార్యక్రమాలను కొనసాగించాలని అన్నారు.ఇక నుంచి నిరంతరాయంగా ప్రతి ఏటా రెండు రోజులపాటు డిసెంబరు మాసంలో తెలంగాణ తెలుగు మహాసభలు వైభవంగా నిర్వహించబడతాయన్నారు. అలాగే, తెలంగాణ గడ్డపై తెలుగును తప్పని చేస్తామని, అందులో భాగంగానే ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇప్పటికే తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేశామని తెలిపారు .పదవి విరమణ పొందిన భాషా పండితుల భృతి కోతను ఎత్తేస్తామని ప్రకటించారు. భాషా పండిత మిత్రులకు ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేరుస్తామని ఉద్ఘాటించారు.తెలుగు మహాసభలను సంతోషంగా నిర్వహించుకొని గొప్పగా ముందుకు వెళ్లామని తెలిపారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి.. ప్రతీ ఒక్కరూ సభలను విజయవంతం చేసేందుకు కృషి చేశారని పేర్కొన్నారు.
