సబ్బండ వర్గాల భాగస్వామ్యంతో సంక్షేమం, అభివృద్ధి అనే ప్రణాళికతో ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరో కీలక వర్గం సంఘీభావం తెలిపింది. చేనేత కార్మికులకు చేయూత ఇచ్చేందుకు రాష్ట్ర ఐటీ, చేనేత శాఖా మంత్రి కే తారకరామారావు వారం లో ఒక రోజు తప్పనిసరిగా చేనేత వస్త్రాలను ధరించాలని ప్రకటించడమే కాకుండా..దాన్ని తాను ఆచరణలో చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కీలక పిలుపును అందుకొని తాము సైతం అంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ముందుకు వచ్చారు. అంతేకాకుండా…. ఏకంగా ఐటీ కారిడార్‌లో ప్రత్యేకంగా మేళా ఏర్పాటు చేయించుకున్నారు.
హైటెక్ సిటీలోని టెకీలు చేనేత వస్త్రాలను ధరించడంపై చూపిన ఆసక్తి నేపథ్యంలో ప్రత్యేకంగా ఏర్పాటయిన హ్యాండ్లూమ్ మేళాను రాష్ట్ర ఐటీ, చేనేత, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత రంగాన్ని ప్రోత్సహించడానికి మనమంతా చేనేత వస్త్రాలను ధరించాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ , ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగులు చేనేత వస్త్రాలను ధరించి నేతన్నకు అండగా నిలవాలని ఆయన కోరారు. బ్రాండెడ్ వస్త్రాలకంటే చేనేత వస్త్రాలు తక్కువ ధరకే లభిస్తాయని వివరించారు.
వారంలో ఒక రోజు తప్పనిసరిగా చేనేత వస్త్రాలను ధరించాలని మంత్రి కేటీఆర్ నిర్ణయం ప్రకారం తామంతా పాటిస్తున్నామన్నారు. ప్రభుత్వం హ్యాండ్లూమ్ సంక్షేమానికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తుందని వివరించారు. నేత కార్మికులను ఆదుకుని వారికి జీవనోపాధి కలిపించి నేత కార్మికుల కుటుంబాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపుకు స్పందించిన ముందుకొచ్చిన ఐటీ ఉద్యోగులకు ఈ సందర్భంగా జయేశ్ రంజన్ కృతజ్ఞతలు తెలిపారు.