ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సినీ పరిశ్రమను గౌరవించడం సంతోషకరమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సభల సంధర్బంగా తమని గౌరవించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్తున్నట్లు ఆయన వివరించారు. సంస్కృతి, సంప్రదాయాలకు పూర్వవైభవం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు సినీ కుటుంబ తరపున ప్రత్యేక ధన్యవాదాలని ఆయన అన్నారు.
`ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన తెలుగే కాదు, అయన కలలు కూడా తెలుగులోనే కంటారు` అని ప్రశంసించారు. 1 నుండి 12 తరగతి వరకు తెలుగు చదవాలని నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అలాంటి వ్యక్తి ఆలోచన మార్గంలో మనందరం నడవాలని ఆయన కోరారు. ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే తెలుగుమాట్లాడుకోవడం లేదని ఇది బాధాకరమని అన్నారు.
ఢిల్లీలో ఇద్దరు హిందీ మాట్లాడేవాళ్ళు హిందీలోనే మాట్లాడుతారు. కానీ తెలుగు వాళ్ళు మాత్రం అలా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు తెలుగు మాట్లాడేలా నిర్ణయం తీసుకోవాలని చిరంజీవి కోరారు. ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు అని ప్రముఖ హీరో నాగార్జున అన్నారు. వెలకట్టలేని సంపద తెలుగు భాష అని మరో హీరో వెంకటేష్ అన్నారు. తెలుగు భాషను మనమందరం కాపాడుదామని ఆయన పిలుపునిచ్చారు.