భాగ్యనగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం తెలుగు సినీ సంగీత విభావరి జరగ్గా.. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రపీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి కేటీఆర్‌లు పాల్గొన్నారు. ఇక సినీ రంగం నుండి కృష్ణ, విజయనిర్మల, జమున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, జగపతి బాబు, రాఘవేంద్రరావు, రాజమౌళి, ఆర్ నారాయణ మూర్తితో పాటు పలువురు నటీనటులు హాజరయ్యారు.
అయితే ఈ సందర్భంగా పలువురు తెలుగు సినీ ప్రముఖులను ప్రభుత్వం తరుపున సన్మానించారు. అనంతరం సినీ తారలు తెలుగు గొప్పదనం గురించి, తెలుగు భాష తీయదనం గురించి మాట్లాడారు. ఇక ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. తెలుగును ఎందుకు గుర్తించాలి, గౌరవించాలి.. అన్న దానితో పాటు దాని ప్రత్యేకత గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. ఇలాంటి సభలను స్ఫూర్తిగా తీసుకోవాలని, తెలుగు భాషను ముందు తరాలకు అందించాలని కోరుకుంటున్నానన్నారు. సీఎం కేసీఆర్ ఈ రాష్ట్రంలో 1వ నుండి 12వ తరగతి వరకు తెలుగు భాష తప్పనిసరి చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని చిరంజీవి చెప్పారు.