చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల వేటకు ప్రభుత్వమే తవ్వకాలు జరిపిస్తున్నసంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో జోరుగా తవ్వకాలు సాగిస్తున్న మైనింగ్ సిబ్బందికి సోమవారం ఒక విషయమై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన కోటలో భారీగా గుప్తనిధులు ఉన్నట్లు అక్కడి వాళ్లు బలంగా విశ్వసిస్తారు. ఇటీవలి కాంలో అక్కడ గుప్తనిధుల కోసం అక్రమ తవ్వకాలు జరిపేవాళ్లు ఎక్కువైపోవడంతో , వీటివల్ల నిత్యం గొడవలు కూడా జరుగుతుండటంతో ఇదంతా దేనికని ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా గత ఐదు రోజులుగా చెన్నంపల్లి కోటలో అధికారులు తవ్వకాలు నిర్వహిస్తున్నారు. విజయనగర రాజుల కాలం నాటి నిధి నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని అధికారులు కూడా గుర్తించి తవ్వకాలు కొనసాగిస్తున్నారు.
అయితే సోమవారం జరుపుతున్న తవ్వకాల్లో నిధి ఉన్న ప్రదేశాన్ని అధికారులు గుర్తించినట్టు ప్రచారం జరుగుతోంది. గత ఐదు రోజులుగా భారీ యంత్రాల సాయంతో తవ్వకాలు సాగించిన గనులు,భూగర్భ శాఖ అధికారులు నిధి ప్రదేశాన్ని కనుగొన్నారనే పుకార్లు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వమే ఇక్కడ నిధి విషయం తేల్చేసేందుకు రంగంలోకి దిగింది. సంబంధిత అధికారులతో అత్యాధునిక సాంకేతిక పరికరాలు, మెటల్ డిటెక్టర్ల సాయంతో ప్రభుత్వమే నిధిని వెలికి తీసేందుకు తవ్వకాలు జరిపిస్తోంది. అయితే సోమవారం నిధి ఉన్న ప్రాంతాన్ని అధికారులు గుర్తించారంటూ పుకార్లు రావడం సంచలనం సృష్టించింది. దీనికి తోడు తవ్వకాలు జరుపుతున్న ప్రాంతానికి ఉన్నతాధికారులు రావడం, కోట చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేయడం వదంతులకు మరింత బలం చేకూర్చింది. అమరావతి నుంచి అధికారుల రాక… కర్నూలు జిల్లా ఉన్నతాధికారులతో పాటు అమరావతి నుంచి పురావస్తు శాఖ అధికారులతో సహా పలువురు ఉన్నతాధికారులు ఈ ప్రాంతానికి ఇప్పటికే చేరుకున్నట్లు తెలిసింది. అలాగే గుర్తింపు పొందిన అధికారులు మినహా మరెవరినీ కోటలోకి అనుమతించడం లేదట. స్థానికులు చెబుతున్నది ఏమంటున్నారంటే కోట లోని ఓ గది కింద దాదాపు 20 అడుగుల లోతున ఉన్న రహస్య సొరంగాన్ని అధికారులు కనిపెట్టారట. ఇప్పుడు ఆ సొరంగం ఎక్కడకు దారి తీస్తుందోనన్న విషయాన్ని స్కానర్ల సాయంతో పరిశీలిస్తున్నారట. ఆ తర్వాత నిధి రహస్యం బైటపడుతుందట.అధికారులు మాత్రం అవన్నీ వట్టి పుకార్లే అంటున్నారు. ఇప్పటివరకు కొన్ని అస్థి పంజరాలు,ఎముకలు తప్ప ఇంకేమీ దొరకలేదంటున్నారు. భారీగా జనం చేరిక… నిధి దొరికిందన్న తాజా పుకార్లతో ఎక్కడెక్కడివారు, పరిసర ప్రాంతాల ప్రజలు, స్థానికులు పెద్ద సంఖ్యలో కోట వద్దకు చేరుకుని, ఏం జరుగుతుందోనన్న విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.