ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలంగాణలో పుట్టిన వాళ్లకు ప్రేమించడం, ఎదురించడం రెండు తెలుసని అన్నారు. `ఎంతో మంది కవులు, ప్రముఖులను ఈ సభ గుర్తు చేస్తుంది. తెలుగు విడిపోలేదు.. రాష్ట్రం మాత్రమే విడిపోయింది` అని ఆయన అన్నారు.
తల్లి ఒడిలో నేర్చుకున్న భాష తెలుగు అని అన్నారు. మమ్మీ, డాడీల సంస్కృతి పోవాలని…తెలుగు భాష రావాలని బాలయ్య కోరారు. తెలుగు భాష ఎంతో రమణీయం.. కమనియమని బాలకృష్ణ అన్నారు. దేశంలో తెలుగు మాట్లాడేవారు రెండో స్థానంలో ఉన్నారని అయినప్పటికీ… ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే తెలుగు మాట్లాడుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భాషను గౌరవిస్తేనే జాతిని గౌరవించినట్లని స్పష్టం చేశారు. ప్రముఖ హీరో మోహన్ బాబు మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహించాలని, తెలుగు కాపాడాలని కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు అభినందనలు తెలిపారు. సాధించాలి.. సాధించాలని తెలంగాణ రాష్ట్రం సాధించారని గుర్తు చేశారు. ప్రతి నటుడిని, కళాకారున్ని స్వయంగా పలకరించిన మంత్రి కేటీఆర్ సంస్కారానికి అభినందనలు తెలిపారు. మంత్రి కేటీఆర్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అని పేర్కొంటూ అలాంటి వ్యక్తిని నా స్వంత శాలువతో సత్కరిస్తానని ప్రకటించారు.