బెజవాడ మరోసారి ఉలిక్కిపడింది. జన సంచారం రద్దీగా ఉండే సమీపంలో హత్య జరగడంతో ప్రజలు గజగజ వణికిపోయారు. నగరంలోని రాఘవేంద్ర థియేటర్ వద్ద ఆదివారం అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు చందా వెంకటేశ్వర రాజు(55)ను అతి దారుణంగా పొడిచి చంపారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు. రాజు శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నట్లు గుర్తించామని తెలిపారు. రాజు శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయని, తలకు పెద్ద గాయం కావడం వల్లే మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. డబ్బుల కోసమే హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. అంతేగాక ఇటీవల గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని నాజర్‌పేటకు చెందిన రౌడీషీటర్ వేమూరి సుబ్రహ్మణ్యం (35), అలియాస్ సుబ్బు తన ప్రత్యర్థుల చేతిలో విజయవాడ నగరంలోని మాచవరం ఏరియాలో బుధవారం దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆరుగురు వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో సుబ్బును నడిరోడ్డుపై కిరాతకంగా నరికి చంపారు. ఈ సంఘటన నగరంలో కలకలం రేపింది.ఇప్పుడు ఈ హత్యతో మరింత భయంగా ఉండే పరిస్థితి అని ప్రజలు అంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
