దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన గుజరాత్ ఎన్నికల్లో.. దాదాపు ఇరవై ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మరోమారు అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధీనంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌ని కూడా లాగేసుకుంది. అయితే సోమవారం ఉదయం నుంచి పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్షణ క్షణం ఉత్కంఠం రేపుతూ.. ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. మొదట బీజేపీ ఆధిక్యంలో ఉండగా.. ఆ తర్వాత కాంగ్రెస్‌కి ఆధిక్యం వచ్చింది.. ఇక ఆ తర్వాత ఆధిక్యంలోకి వచ్చిన బీజేపీ వెనుకంజ వేయకుండా అధికారాన్ని నిలబెట్టుకుంది.
అయితే గుజరాత్ ఎన్నికలకు సంబందించి వార్తలను టీవీ చానెళ్లు ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకొచ్చారు . ఏ ఒక్క చానల్ వారు కూడా సరైన ఫిగర్ చెప్పకపోవడం విశేషం. దీని పై తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, ఫలితాలు చాలా కన్ఫ్యూజింగ్‌గా ఉన్నాయని.. ఒక్కో చానల్ ఒక్కోలా ఫలితాలను చూపిస్తోందని, ఎవరు, ఎక్కడ ముందంజలో ఉన్నారన్న విషయమై స్పష్టత లేదని అన్నాడు. ఎవరి అభిప్రాయాలు వారివేనన్న విషయం తనకూ తెలుసని.., అయితే నిజాన్ని వాస్తవ విజయాన్నీ ఎవరూ మార్చలేరని తెలిపాడు. దీంతో ఆయన ట్వీట్ నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.