సవ్య సాచి అంటే… పురాణాల్లో అర్జునిడిని సవ్య సాచి అనేవారు. అనగా, శరీరానికి కుడి, ఎడమ వైపులలో వున్న అనుబంధ అంగాలను (చేతులు, కాళ్ళు, కళ్ళు) సమాన స్థాయిలో ఉపయోగించగలిగే స్థితిని సవ్యసాచిత్వం అంటారు. రెండు చేతులను ఒకే సామర్థ్యం తో ఉపయోగించే బలం అర్జునుడికి ఉండేది. తను తన రెండు చేతులతో బాణాలను విసిరేవాడు. అందుకే అర్జునుడిని సవ్య సాచి అనే పేరొచ్చింది. అయితే ఇప్పుడు ఆ విషయం ఏందుకంటారా.. తెలుగు రాజకీయాల్లో మనకూ ఓ సవ్యసాచి ఉన్నాడండి… ఆయన ఎవరో కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
ఆయన రాజకీయ వ్యూహం ముందు ప్రత్యర్థి మోకరిల్లాలిసిందే. ఒంటరి గా పోరాటం మొదలు పెట్టి అందరు ఆ ఉద్యమంలో భాగం కాక తప్పని పరిస్థితి కల్పించి తెలంగాణ సాధనలో తనదైన ముద్ర వేయించుకున్న ధీశాలి ఆయన. అలా సాధించిన తెలంగాణ కు రాజైన కేసీఆర్ ప్రపంచ తెలుగు మహా సభలను అపూర్వ రీతిలో ఐదురోజులపాటు యజ్ఞంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా తొలి రోజు కేసీఆర్ అచ్చ తెలుగు ప్రసంగంతో అందరిని కట్టిపడేశారు. ఇప్పుడు తాజాగా మాతృభాష పై తన మమకారాన్ని వినూత్నంగా చాటి చెప్పారు. నలభైయేళ్ళ క్రితం కంఠతా చేసిన పద్యాలను అలవోకగా అప్పగించి సాహిత్య అభిమానులతో జేజేలు కొట్టించుకున్నారు. భాషాభిమానులు గులాబీ బాస్ పద్యాలు వల్లెవేసిన తీరుకు అబ్బురపడి ఫిదా అయ్యారు. ఏనాడో నలభై ఏళ్ళనాడు దాదాపు మూడు వేల పద్యాలు నేర్చుకుని దారి తప్పి మళ్ళీ ఈ దారికి వచ్చానని సాహితీ సభలో సభికుల హర్షధ్వనాలమధ్య వెల్లడించారు.