మరికొద్ది సేపట్లో విడుదల కానున్న హిమాచల్, గుజరాత్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్రజలంందరూ ఎదురు చూస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు కొన్ని సంస్థలు చేసిన సర్వే ఫలితాలు బీజేపీ వైపే మొగ్గు చూపినప్పటికీ.. బీజేపీ నేతల్లో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. ఇందుకు కారణం గతంలో బీహార్‌లో జరిగిన ఎన్నికల సమయంలో పలు సర్వే సంస్థలు బీజేపీ గెలుస్తుందని, తమ సర్వే ద్వారా ఆ విషయం వెల్లడైందనంటూ ఎగ్జిట్ పోల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ తరువాత జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో మాత్రం బీజేపీ డీలా పడి జేడీయూ చీఫ్ నితీష్‌కుమార్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.
అలాగే, ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి బీజేపీ సీట్లు సాధించింది. అయితే గుజరాత్ విషయంలో బీజేపీ గెలుస్తుందని చెబుతున్నప్పటికీ, ఆ రాష్ట్రంలో మారిన సామాజిక సమీకరణాల నేపథ్యంలో పాటిదార్లు సహా మరికొన్ని వర్గాలకు చెందిన ఓటర్లు ఎటువైపు మొగ్గారన్నది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.
కొన్ని నియోజకవర్గాల్లో ఆయా సామాజికవర్గాలకు చెందిన ఓటర్లు అభ్యర్థుల జయాపజ యాలను నిర్ణయించే సంఖ్యా బలాన్ని కలిగి ఉండడంతో ఫలితాలు పూర్తిగా తారుమారయ్యే అవకాశం లేకపోలేదు.
ఏదేమైనా మరికొన్ని గంటల్లో హిమాచల్, గుజరాత్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.